ఆయన స్వరాలకు తరించని రాగం లేదు.. ఆ రాగాలకు పులకించని గీతం లేదు. ఆ గీతాలకు పరవసించని హృదయమే లేదు. భారతీయ సినీ సంగీత సముద్రాన్ని తన స్వరాలతో మదించి.. గానామృతాన్ని పంచి ఇచ్చిన సంగీత మాంత్రికుడు ఆయన. తేనెలాంటి పల్లవి, చెరకు రసం లాంటి చరణం.. అమృత ధారగా కురిసే నేపథ్య సంగీతం వెరశి ఆయన పాట. ఆ లయ రాజా పేరు ఇళయరాజా. నేడు ఆయన పుట్టిన రోజు.
ఇళయరాజా సంగీతానికే సరిగమలు నేర్పగల జ్ఞాని. సప్తస్వరాల్నే శ్రుతి చేయగల దిట్ట. సంగీత పరికరాలతో స్వరరాగ గంగా స్నానాలు చేయించి.. శ్రోతల్ని అనుభూతుల తీరాలకు చేర్చగల ప్రతిభాశాలి. భారతీయ సినీ సంగీతాన్ని కేవలం తన వేలికొసలతో శాసించే ఆ మాస్ట్రో .. ఒక సంగీత చరిత్ర. ఒక చారిత్రక సంగీత కారుడు. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా.. అందరినీ సమానంగా రాగ రంజితం చేయడమే ఇళయరాజా లక్ష్యం. అందుకే ఆయన అన్ని దశాబ్దాలుగా భారతీయ సినీ సంగీతాన్ని ఏల గలుగుతున్నారు.
నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితంలో .. 1000 సినిమాలకు పైగానే సంగీతం అందించి.. దాదాపు 5000లకు పైగానే పాటల్ని కంపోజ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు ఇళయరాజా. 70, 80, 90 దశకాల్లో ఇళయరాజా దక్షిణాది సినీ సంగీత సముద్రంలో సునామీలా విరుచుకుపడ్డారు. అప్పటి సంగీత దర్శకులు ఆయన ధాటికి తట్టుకోలేక విలవిలాడిపోయారంటే.. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కొత్త కొత్త సంగీత పరికరాలతో .. శాస్త్రీయ, పాశ్చాత్య సంగీత మేలికలయికతో సరికొత్త సంగీతాన్ని సృష్టించి.. ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే పాటలు ఎన్నింటినో కంపోజ్ చేశారు ఇళయరాజా. పాటకి బాణీ కట్టాలన్నా.. బాణీకి పాటను కూర్చాలన్నీ ఇళయరాజా అనుసరించే విధానమే వేరు. ఒక పాటని కంపోజ్ చేయడానికి .. వాటి స్వరాల్ని పూర్తిగా నొటేషన్స్ రూపంలో రాసి.. ఆర్కెస్ట్రా బృందానికి అందిస్తారు. దాన్ని అనుసరించి ఆర్కెస్ట్రా బృందం ఒకో వాయిద్యాన్ని ప్లే చేస్తారు. అయితే ఏ ఇన్ స్ట్రుమెంట్ ను ఏ తరహాలో ఎంత మోతాదులో వాయించాలో ఇళయరాజానే సూచిస్తారు. అందుకే ఆయన పాటలన్నీ స్వచ్ఛమైన సంగీతానికి చిరునామాగా నిలిచిపోయాయి.
ఈ వయసులో కూడా ఇళయరాజా .. పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అనంతమైన స్వరాల.. తీరులోనే ఆయనలోని సంగీత తృష్ణ కూడా అనంతమని అర్ధమవుతోంది. అందుకే ఆయన సంగీత జ్ఞాని అనిపించుకున్నారు. ఇళయరాజాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది లియో న్యూస్.
Must Read ;- శ్రీమతికి కేకు తినిపించిన సూపర్ స్టార్ కృష్ణ











