న్యాయవ్యవస్థను కించపరుస్తూ, జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 17 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11న ఎఫ్ఐఆర్ నమోదైంది. నేరపూరిత బెదిరింపులను శిక్షార్హం చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 506 సహా పలు సెక్షన్ల కింద ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మొదలుకుని జూన్ 15 వరకు సీఐడీ 12 కేసులు నమోదు చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నుంచి తీసుకున్న 12 ఎఫ్ఐఆర్ లను కలపి ఒకే కేసుగా నమోదు చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 48 మందిపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, కేవలం 16 మందినే ఇప్పటి వరకూ గుర్తించగలిగారు. గుర్తుతెలియని ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. మిగిలిన 31 మందిని వదిలేశారా? విచారిస్తున్నారా? తేలాల్సి ఉంది.
93 మంది ఏమయ్యారు
జడ్జిలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 93 మందికి నోటీసులు జారీచేసిన సీఐడీ, చివరకు 17 మందిపై మాత్రమే కేసులు పెట్టడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎవరిపై కేసు ఉండాలి, ఎవరిని కేసుల నుంచి తప్పించాలనే ఆదేశాలు వైసీపీ పెద్దల నుంచి సీఐడీ అధికారులకు అందాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వారి ఆదేశాల మేరకు కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 93 మంది పోస్టులు పెట్టగా, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 48 మందిపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశారు. వారిలో కేవలం 17మందిపై మాత్రమే కేసులు నమోదు చేసి, మిగిలిన 31 మందిని ఉద్దేశపూర్వకంగా తప్పించారనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.వారందరూ ప్రముఖులేనే అనే సందేహాలూ పుడుతున్నాయి.
Also Read ;- జగన్ ధిక్కరణకు రెండే దార్లు.. రణమా? శరణమా?
వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు
న్యాయవ్యవస్థపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశంలోనే నిప్పులు చెరిగారు. ఇక మంత్రి సీదిరి అప్పలరాజు, చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిపై సీఐడీ కేసులు నమోదు చేయలేదు. వీరు అధికారపార్టీలో కీలక నేతలుగా ఉండటమే కారణంగా తెలుస్తోంది.
సీబీఐ కొత్తగా కేసులు నమోదు చేస్తుందా?
న్యాయవ్యవస్థ, జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ, అప్పగించిన కేసులనే సీబీఐ విచారిస్తుందా? లేదంటే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసిన 48 మందిపైనా కేసులు నమోదు చేస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కీలకనేతలు ఆరోపణలు చేయడం వల్లే, తరవాత సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియాలో జడ్జిలపై చెలరేగిపోయారు. ప్రముఖులను వదిలేసి, పనికిమాలిన వారిపై కేసులు పెట్టడం వల్ల సీబీఐ సాధించేదేమీ ఉండదని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు.
Also Read ;- న్యాయవ్యవస్థపై బురద : అనైతిక పోకడలు వైసీపీకే చేటు!