నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 18,449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.మొత్తం 25 రౌండ్లలో 10,11,14 రౌండ్లలో మాత్రమే కాంగ్రెస్ అధిక్యం సాధించగా మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది.ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది.దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగి విషయం తెలిసిందే. సాగర్‌లో మొత్తం పోలైన ఓట్లు 1,89,782 కాగా పోస్టల్ ఓట్లు, పోలైన ఓట్లు కలిపితే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కి 87,254, కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డికి 68,714, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కి 7,159ఓట్లు వచ్చాయి. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
టీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే తెలంగాణ భవన్‌లోనూ పార్టీ నేతలు, పలువురు ముఖ్య కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే సంబరాల్లో భాగంగా బాణసంచా కాల్చారు. ఒక్కసారిగా పార్టీ కార్యాలయ పందిరిపై నిప్పు రవ్వలు పడడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. పెనుప్రమాదం తప్పింది.
మావైపే ప్రజలు:టీఆర్ఎస్
ఇక నాగార్జునసాగర్‌లో గెలుపుతో పాటు ఇటీవలే ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలవడంతో ప్రజలు తమవైపే ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో కొన్ని పరిస్థితుల్లో ఎదురు దెబ్బలు తగిలాయని, ఇతర పార్టీల మాయమాటలు ప్రజలు నమ్మడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మంత్రులకు, ఎమ్మెల్యేలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించడంతో పాటు ప్రచారంలో పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలు వివరించారు. దీంతోపాటుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీఆర్‌ఎస్ గెలిస్తేనే నియోజకవర్గానికి నిధులు వస్తాయన్న అభిప్రాయం ఓ వైపు ఉండడం, నాగార్జునసాగర్ ఎన్నికలకు సంబంధించి రెండు సభలకు కేసీఆర్ హాజరు కావడం, నియోజకవర్గానికి నిధులు కేటాయించడంపై ప్రకటన చేయడం కలిసొచ్చిందని చెప్పాలి. అదే సమయంలో బీసీ ఫ్యాక్టర్ కూడా పనిచేసిందని చెప్పవచ్చు. బీజేపీలో టిక్కెట్ దొరకకపోవడంతో నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరడంతో ఆయన సామాజిక వర్గ ఓట్లు టీఆర్ఎస్ వైపు వెళ్లాయనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తం మీద టీఆర్ఎస్ గెలవడంతో మరోసారి తమకు తిరుగులేదని నిరూపితమైందని టీఆర్ఎస్ చెబుతోంది.
కాంగ్రెస్ పార్టీకి మరో పరాజయం
2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మూడు ఎంపీ స్థానాలు, ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి గెలుపు తప్ప.. హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూసిన కాంగ్రెస్‌కు ఇది మరో పరాజయం. ఇక్కడ జానారెడ్డి గెలిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ఈ పరాజయం పార్టీశ్రేణులను నిరుత్సాహం పరుస్తుందని చెప్పవచ్చు. అయితే సంస్థాగతంగా బలంగా ఉండడం ఒక్కటే పార్టీకి ఇప్పుడు ప్లస్ పాయింట్. ఇక్కడే మరో విషయం కూడా గమనించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ..గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య దాదాపు 7వేల ఓట్ల మెజార్టీతో గెలవగా ఇప్పుడు జానారెడ్డిపై నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ 18వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.
బీజేపీకి షాక్..
కాగా దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపుతో దూకుడు పెంచిన బీజేపీ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి రూపంలో ఎదురు దెబ్బ తగిలింగి. ఇక తాజాగా నాగార్జునసాగర్‌లో డిపాజిట్ రాకపోవడం ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మోదీ చరిష్మా, బండి సంజయ్ ప్రసంగాలు నియోజకవర్గంలో పెద్ద ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. బీజేపీకి ఊరట కలిగించే ఏకైక అంశం ఏంటంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2వేల ఓట్లు పార్టీకి రాగా ఈ సారి 7వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. దాదాపు 5వేలకు పైగా ఓట్లు పెరిగాయి. పార్టీకి వచ్చిన ఓట్ల పరంగా చూస్తే 200శాతం ఓట్లు పెంచుకుంది. మొత్త మీద చూస్తే 4శాతం ఓట్లు వచ్చాయని చెప్పవచ్చు.
Must Read ;- సాగర్ ఎన్నికల ఫలితం.. రేవంత్ అడుగులను నిర్థేశిస్తుందా?











