తెలుగు సినిమా కథను గురించి చెప్పుకోవాలంటే, అందులో పరుచూరి బ్రదర్స్ భాగస్వామ్యం గురించి ప్రస్తావించవలసిందే. సినీ రచయితలుగా 1980 నుంచి తిరుగులేని విధంగా వారి ప్రస్థానం కొనసాగుతూనే వుంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో పరుచూరి బ్రదర్స్ ఎంతోమంది దర్శక నిర్మాతలతో కలిసి పనిచేశారు. అనేక విజయాలను అందుకుని తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం పరుచూరి గోపాలకృష్ణ రచయితగా సినిమాలకు పనిచేస్తూనే, ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమం ద్వారా తన అనుభవాలను పాఠాలుగా యువతకు అందిస్తున్నారు. తాజాగా ఆయన ఇటీవల వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను గురించి మాట్లాడారు.
*”సూర్య కథానాయకుడిగా చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను చూశాను. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే, ఒక అద్భుతాన్ని ఈ ప్రపంచం చూసి ఉండేదనిపించింది.
*దర్శకురాలు సుధా కొంగర పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుకుని చేసిన సినిమా ఇది. భారతదేశంలోని ఆ మూల నుంచి ఈ మూలకి ఒక సామాన్యుడు ఒక్క రూపాయి టిక్కెట్ కే విమానంలో ప్రయాణించేలా చేయాలని సంకల్పించిన ఓ కుర్రాడికీ, ప్రపంచాన్నే శాసించేంత డబ్బున్న ఒక విమానాల అధిపతికి మధ్య జరిగిన వార్ ఇది. ఆ వార్ లో హీరో గెలుస్తాడా? లేదా? ఇదే ఈ సినిమాలోని ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దర్శకురాలు సుధా కొంగర .. క్యూరియాసిటీని పెంచే సన్నివేశంతోనే కథను మొదలుపెట్టడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంత గొప్ప సినిమా త్వరగా థియేటర్లకు రావాలని కోరుకుంటున్నాను.
*విమానం ఎక్కలేని పేదవారి గురించి ఈ సినిమా కథానాయకుడు ఆలోచించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు, “అయ్యో ప్రైమ్ వీడియో లేని వాళ్లు ఈ సినిమా ఎలా చూస్తారు?” అని నేను ఆలోచించాను. అంగబలం .. అర్థబలం వున్న ఒక భయంకరమైన వ్యక్తిని, కథానాయకుడు తన మేథో బలంతో ఎలా ఎదుర్కొన్నాడనేది చాలా ఉత్కంఠభరితంగా చూపించారు.
Also Read ;- అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !
*ఒక బలమైన వ్యక్తి .. అతనికి అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు కలిసి, ఒక నిజాయితీ పరుడి ఆశయాన్ని అణచివేయడానికి ఎంతలా ప్రయత్నించారనే విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రైవేటీకరణ వలన పరిస్థితులు ఎలా ఉంటాయనేది నాకు తెలుసు. విదేశాలకి వెళ్లినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమాలో విలన్ ను చూస్తున్నప్పుడు నాకు ఆ సంఘటనలు గుర్తొచ్చాయి.
*సుధా కొంగరగారు గనుక అసలు కథకు ఒక అందమైన ప్రేమకథను అడాప్ట్ చేసుకుని ఉండకపోతే, ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో. ఎందుకంటే ఒక ధనబలం ఉన్నవాడికీ .. ఒక మేథో బలం ఉన్నవాడికి మధ్య పోరాటంగా మాత్రమే ఈ సినిమా చూపించి ఉంటే, చాలామంది ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఉండకపోయేది. హీరోయిన్ ను పరిచయం చేసే తీరుకూడా చాలా బాగుంది. మగవాణ్ణి పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఒక అమ్మాయిగా హీరోయిన్ ను చూపించడం కొత్తగా అనిపించింది.
*ఇక మోహన్ బాబుగారి పాత్ర పరిచయమైనప్పుడు, ఆయనతో ఆ పాత్రను ఎందుకు చేయించారా అనుకున్నాను .. కానీ ఆ పాత్ర ప్రయోజనం ఏమిటనేది ఆ తరువాత అర్థమైంది. మీ కథకు మీరే స్క్రీన్ ప్లే రాసుకోవాలనుకునే విద్యార్థులందరూ, ఎలాగైనా ఈ సినిమా చూడాలి .. ఎందుకంటే ఈ సినిమా ఆడింది స్క్రీన్ ప్లే తోనే” అంటూ చెప్పుకొచ్చారు.
Must Read ;- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మళ్ళీ సూర్య?