అనుకున్నట్లుగానే… తిరుపతి పర్యటనకు వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహార తీరుతో బీజేపీకి బీపీ పెరిగిపోయిందనే చెప్పాలి. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తామే పోటీ చేస్తామని జన సైనికులు తేల్చేయగా… జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం కాస్తంత వేచి చూద్దామన్న ధోరణిని అవలంభించారు. మొత్తంగా అందరూ అనుకున్నట్లుగానే పవన్ తిరుపతి పర్యటన కమలనాథుల్లో టెన్షన్‌ను పెంచేసిందనే చెప్పాలి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ కోసమంటూ గురువారం పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్లారు. జనసైనికుల సాదర స్వాగతాలు అన్ని ముగించుకుని గురువారం రాత్రి పీఏసీ భేటీకి కూర్చున్న పవన్… భేటీలో తిరుపతి ఉప ఉప ఎన్నిక బరిలోకి దిగే విషయంపైనే కీలకంగా చర్చించినట్లుగా సమాచారం. భేటీలో జన సైనికులు బీజేపీ వైఖరిపై నిప్పులు చెరగగా.. పవన్ మాత్రం పొత్తు ఉన్న నేపథ్యంలో మరోమారు బీజేపీ అధిష్ఠానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని వారిని శాంతింప జేసినట్టుగా సమాచారం. తిరుపతి పోరులో జనసేన పోటీ ఖాయమన్న సంకేతాలను మాత్రం పవన్ చాలా స్పష్టంగానే ఇచ్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Must Read ;- తిరుపతికి పవన్.. బీజేపీకి బీపీ పెరిగినట్టేనా?
పొత్తు ఉన్న నేపథ్యంలో..
తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇటు జనసేనతో పాటు అటు బీజేపీ కూడా ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో బరిలో ఎవరు నిలవాలన్న విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేద్దామంటూ బీజేపీ ప్రకటించింది. ఆ కమిటీ సంగతి తేలకుండానే… బీజేపీ తిరుపతి వేదికగా ఎన్నికలకు సన్నాహాలు చేసుకునే పనిలో పడిపోయింది. దీంతో తమతో చర్చించకుండానే పోటీకి ఎలా సిద్ధపడతారన్న భావనతో పవన్ రగిలిపోయారు. అంతేకాకుండా బీజేపీకి గుణపాఠం చెప్పే దిశగా ఏదో ఒకటి చేయాలన్న భావనతో ఆయన తన పార్టీ పీఏసీ భేటీని తిరుపతిలో ఏర్పాటు చేసుకున్నారు. పవన్‌లోని భావనను ముందుగానే పసిగట్టిన జన సైనికులు… బీజేపీపై మరింత మేర వ్యతిరేక భావం పెంచేలా వ్యవహరించారని చెప్పాలి. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో జనసేన బాగానే వ్యవహరిస్తున్నా… బీజేపీ ఏపీ శాఖకు చెందిన నేతలు మాత్రం సవ్యంగా వ్యవహరించడం లేదని పవన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి విరుగుడుగా తిరుపతి ఉప పోరులో జనసేన తరఫున అభ్యర్థిని తప్పని సరిగా దించాల్సిందేనని కూడా జన సైనికులు పవన్‌కు సూచించారు. ఈ విషయంలో పవన్‌పై వారు ఓ మోస్తరు ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా సమాచారం.
మనస్పర్ధలు పక్కనపెట్టి..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంత ఈజీగా తగవు పెట్టుకోవడం మంచిది కాదన్న భావనతో ముందుకు సాగిన పవన్… తిరుపతి ఉప పోరులో జనసేన పోటీకి సంబంధించి మరోమారు బీజేపీ అధిష్ఠానంతో చర్చిద్దామని, ఆ తర్వాతే పోటీపై నిర్ణయం తీసుకుందామని జన సైనికులను శాంతింపజేసినట్టుగా సమాచారం. అంతేకాకుండా తిరుపతి ఉప పోరులో జనసేన అభ్యర్థి బరిలో నిలిచినా, లేదంటే బీజేపీ అభ్యర్థి బరిలో నిలిచినా కూడా ఉమ్మడి పార్టీ అభ్యర్థి విజయం కోసం అందరూ సహకరించాల్సిందేనని, మనస్పర్ధలు పక్కనపెట్టి పని చేయాలని కూడా జన సైనికులకు సూచించారు. మొత్తంగా తిరుపతి ఉప పోరులో తామే పోటీ చేస్తామని, అందుకు ఓకే చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్న సంకేతాలను పవన్ పంపారు. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఏమంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
Also Read ;- పవన్ తిరుమల పర్యటన ఆంతర్యమేమిటో?











