ఇప్పటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఓవర్లు అయిపోతున్నా బ్యాటింగ్ చేయకుండా నిలబడిపోయినట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్ధితి. మ్యాచ్ ఆడకుండానే గెలుపు అవతలోళ్లకు అప్పచెప్పేలా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్‌ను నిర్ణయించుకునే తీరికా లేదు.. తెలివి లేదు..వీళ్లకెందుకు గెలుపు సంగతి…అసలు మ్యాచ్ ఆడటం దేనికి అనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి. అంత ఘోరంగా తయారైంది టీకాంగ్రెస్ వ్యవహారం.
రేవంత్‌రెడ్డి ఫైనల్ అనుకున్నాక..
రేవంత్‌రెడ్డి ఫైనల్ అని అనుకున్నాక.. జీవన్‌రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. మరోవైపు పట్టు వదలని విక్రమార్కుడిలా బేతాళ కథలకు సమాధానాలు అన్నట్లు డైలాగులు కొడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు అవకాశం లేదని తెలిసినా..అవతలివారి అవకాశాలు చెడగొట్టడానికే అన్నట్లు నేనున్నా అంటూ జగ్గారెడ్డి కూడా వాయిస్ వినిపిస్తున్నాడు. మరోవైపు రేవంత్‌రెడ్డికి ఇస్తారని ఎదురు చూసిన నేతలంతా తలో దారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ వైపు వెళ్లాల్సిన వారు యూ టర్న్ తీసుకుని బిజెపి వైపు వెళుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కాంగ్రెస్ నేతలకు,అధిష్టానానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చాలామంది..తాము, తమ ప్రయోజనాలు సేవ్ అయితే చాలు.. పార్టీ ఎటుపోతే మనకేంటి అనే ఆలోచనలో ఉన్నట్లు కనపడుతున్నారు. ఒకరిద్దరు అయితే వారి బలం వారి జిల్లాకు పరిమితం అని తెలిసినా.. రేవంత్‌రెడ్డికి మాత్రం పదవి రాకూడదన్నట్లే ప్రవర్తిస్తున్నారు.
Must Read ;- టీపీసీసీని తేల్చే పనిలో అధిష్టానం.. రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి
రేవంత్‌రెడ్డి తనదైన దూకుడుతో..
మరోవైపు రేవంత్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల అభిమానాన్ని పొందారనే చెప్పాలి. తనదైన దూకుడుతో నాయకుడిగా కనిపిస్తున్నారు. ఓటుకు నోటు కేసు, టీడీపీ నుంచి వచ్చారన్న పాయింట్లు ఎలా ఉన్నా.. వ్యూహాల్లో గాని, ధీటుగా ప్రత్యర్ధిని ఎదుర్కోవడంలోగాని, బలం, బలగంలో గాని..రేవంత్‌రెడ్డిని మించిన నాయకుడు కాంగ్రెస్‌లో అయితే ప్రస్తుతం ఎవరూ లేరనే పార్టీలోనే చెప్పుకుంటున్నారు.అయినా కాంగ్రెస్‌లో మొదటి నుంచి ప్రభావం చూపించే లాబీయింగ్ ఇంకా రేవంత్‌కు పదవి ఇవ్వకుండా చాలా బలంగా వెనక్కి లాగుతున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వకుండా ఆపటమే అధిష్టానం మనసులో ఏముందో చెబుతోంది. రేవంత్‌కు తప్పఇంకెవరికీ ఇవ్వకూడదనే అభిప్రాయానికి రావడం వల్లే ఏ నిర్ణయమూ అధిష్టానం ప్రకటించలేకపోతోంది.
బీజేపీది బలుపు కాదు వాపు..
దుబ్బాక,గ్రేటర్ విజయాలతో రెచ్చిపోయిన బిజెపిది బలుపు కాదు వాపు అని తేలిపోయింది. రాష్ట్రంలో ఇప్పటికీ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్‌దే బలం. బండి సంజయ్ అరుపులకు ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది. బిజెపి టీఆర్ఎస్‌ల మధ్య ఒక అవగాహన కుదిరిందనే బలమైన ప్రచారం…బిజెపి అవకాశాలను దారుణంగా దెబ్బ కొట్టింది. కాని కాంగ్రెస్ వారు తమ కళ్లలో వారే పొడుచుకుంటూ.. బిజెపికి లేని అవకాశాలను సృష్టిస్తున్నారనే చెప్పాలి.
రేవంత్‌రెడ్డికి ఇవ్వకుండా.. వేరెవరికి ఇచ్చినా.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చే సమస్య లేదని కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.నిర్ణయం లేటు కావడం వలన.. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని.. ఇంకా లేటు చేస్తే..ఇక అన్ని దారులు మూసుకుపోతాయని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సైతం ఎంతమంది ఎన్ని చెప్పినా.. ఎన్ని ప్రపోజల్స్ చేసినా.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం ఓపికగా ఎదురు చూస్తున్నారు.
Must Read ;- ఎంపీ రేవంత్ సంచలన ట్వీట్ : యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా..? అంటూ సెటైర్











