ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటుంది. దీంతో గ్రేటర్ ఎన్నికల వాతావరణంతో హైదరాబాద్‌లో రాజకీయ వేడి అలుముకుంది. పోటాపోటీగా ప్రచారాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఎన్నికల ప్రచారంలో దింపి టీఆర్ఎస్ పార్టికి ఝలక్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జెపీ నడ్డా, ఫడ్నవీస్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి జాతీయ స్థాయి నేతలు గ్రేటర్ ఎన్నికల రంగంలోకి దిగడంతో టీఆర్ఎస్ పార్టీ కాస్త వెనుకబడినట్లయిందనే చర్చ జరుగుతోంది. ఈ విధంగా జాతీయ నాయకత్వాన్ని అంతా హైదరాబాద్‌లో మొహరించడంతో ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఆ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి. మరి దానిని ఓట్ల రూపంలో మల్చుకోవడంలో ఎంత వరకు బీజేపీ పార్టీ నేతలు విజయం సాధిస్తారనేది ఫలితాలే నిర్ణయిస్తాయి.
అయితే దూకుడు మీదున్న బీజేపీని బ్రేక్ వేయాలంటే గులాబీ దళపతి కేసీఆర్ వల్లనే సాధ్యమన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సభ ప్రారంభం కానుంది. అయితే కేసీఆర్ సభ షెడ్యూల్ ముందస్తుగానే ఖరారు అయినప్పటికినీ బీజేపీని ఎదుర్కొనేలా కేసీఆర్ ప్రసంగం ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. అలాగే ఈ సభను భారీగా సక్కెస్ చేసేలా కూడా టీఆర్ఎస్ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారట. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి 2 వేల నుంచి 4 వేల వరకు సభకు హాజరయ్యేలా ముందస్తు ఏర్పాట్లను గులాబీ పార్టీ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కమల దళం దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఈ సభనుంచే వారిని అడ్డుకునేలా, వారిపై పైచేయి సాధించేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ ఆ సభ నుంచి ఏం మాట్లాడుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించే విధంగా రాయితీలు, ఉచిత హామీలతో కూడిన మరికొన్ని ప్రకటనలను కూడా కేసీఆర్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మునపటి తీరులాగా తన ప్రసంగంలో వాడివేడీ, వాగ్ధాటితో ప్రజలను ఆకర్షించేలా కేసీఆర్ ప్రసంగం ఉండనుందట. ఏదీఏమైనా ఈ సభా వేదిక నుంచి గులాబీ దళపతి కేసీఆర్ విపక్ష పార్టీలపై గర్జించనున్నారని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు.
Must Read ;- ఇక్కడే ఆరంభం కావాలి.. గ్రేటర్‌పై బీజేపీ భారీ అంచనాలు











