మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్ లీకైన దుర్ఘటనలో24 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.స్థానిక జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నింపుతుండగా లీకైంది. దీంతో ఆసుపత్రిలో రోగులకు దాదాపు అరగంట పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో 22మంది కొవిడ్ బాధితులు చనిపోయారు. ఈ ఘటనపై సర్వత్రా దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు ఈ ప్రమాదం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేయడంతోపాటు బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5లక్షలను ప్రకటించింది.
విమర్శల యుద్ధం..
ఈ ఘటనకు సంబంధించి రాజకీయపక్షాల మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. స్థానిక బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పాలకవర్గ వైఫల్యంగా అభివర్ణించింది. నాసిక్ పురపాలక సంఘ పరిధిలోని ఆసుపత్రి కావడంతో కాంగ్రెస్ ఈ విమర్శలు చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం నుంచి మరో ప్రకటన వెలువడింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై నాసిక్ కలెక్టర్ సూరజ్ మంధారే మాట్లాడుతూ ఆసుపత్రిలో దాదాపు అరగంట పాటు ఆక్సిజన్ నిలిచిపోయిందని, ఆక్సిజన్ అవసరమైన 80 మందిలో 31మందిని వేరే ఆసుపత్రికి తరలించామన్నారు. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె మాట్లాడుతూ ఆసుపత్రి యాజమాన్యం దీనిపై సమాధానం చెప్పాలని, ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. కాగా ఈ ఘటన సమయంలో ఆసుపత్రిలో 171 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
రాజకీయ దుమారం..
ఈ ఘటనపై రాజకీయపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. నాసిక్ పురపాలక సంస్థలో బీజేపీ పాలకవర్గం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై గతంలోనూ పాలకవర్గం పట్టనట్టు వ్యవహరించిందని శివసేన నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని బీజేపీ విమర్శిస్తోంది. కాగా నాసిక్ పురపాలక సంస్థలో బీజేపీ అధికారంలో ఉందని.. ఘటనకు బీజేపీయే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. మేయర్, బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పారిపోయారని ట్వీట్ చేశారు.
Also Read ;- బలిపీఠంపై ఉన్నా.. ప్రాణ దాతగా నిలిచిన విశాఖ ఉక్కు
రికార్డు స్థాయిలో కేసులు..
గత 24 గంటల్లో మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 568 మంది మరణించగా,67,468 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ముఖ్య నగరాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో పుణెలో కొత్తగా 10,852 కరోనా కేసులు, 35 మంది చనిపోవడం గమనార్హం. మహారాష్ట్రలో మొత్తం కేసులు 39,68,262కు చేరుకోగా, మరణాల సంఖ్య 61,424కు చేరింది. పలు పట్టణాల్లో పాక్షిక లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏ క్షణమైనా మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
2017లో నాసిక్‌లోనే..
2017లో నాసిక్ జిల్లా స్థాయి ఆసుపత్రిలో వెంటిలెటర్లు లేకపోవడం, ఆక్సిజన్ కొరత కారణంగా 55మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో నాలుగునెలల్లోనే 187మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆ ఆసుపత్రికి కొద్ది దూరంలోనే ఉన్న జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందని కారణంగా 22మంది కొవిడ్ బాధితులు చనిపోయారు.
Must Read ;- కోవిడ్ నివారణకు 2 కొత్త మందులు.. 24 గంటల్లో వైరస్‌కు అడ్డుకట్ట