పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ తలబెట్టిన “రాజీవ్ రైతు భరోసా దీక్ష”కు అపూర్వ మద్దతు లభించింది. ఆర్మూర్‌లో శనివారం జరిగిన దీక్షలో శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్ కూర్చున్నారు. ఎప్పటిలాగే ఎంపీ రేవంత్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ అర్వింద్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ను ఎండగట్టారు. బండి సంజయ్‌ని తులనాడారు. రేవంత్ మాట్లాడుతున్నంతసేపు.. దీక్షా ప్రాంగణమంతా ఈలలు, జైజై నాదాలతో మార్మోగింది.
బోడ గుండోడు ఏడికి పోయిండు..
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఒడిలో కూర్చుని రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమేనన్నారు. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ నేత రాంమాధవ్ హామీ ఏమైందని ప్రశ్నించారు. “అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా? రైతులతో ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతారు. ఎంపీ బండి సంజయ్‌కు రైతుల గోస కనిపించడం లేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చాక 6,358 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. రైతు బతికుండగా సాయం చేయని కేసీఆర్ చచ్చాక రూ.6 లక్షలు ఇస్తానంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పసుపు రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
శుభం నింపే పసుపే.. రైతులకు ఉరితాడవుతోంది
అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాటలోనే ప్రస్తుత ఎంపీ అర్వింద్ నడుస్తున్నారని ఆరోపించారు. అర్వింద్ పసుపు బోర్డు తెస్తామని, మద్దతు ధర కల్పిస్తామని రాతపూర్వకంగా ఇచ్చిన హామీని గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. బోర్డు ఏర్పాటు చేసి పసుపు పంటకు మద్దతు ధర కల్పించేవరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పారు. పసుపుపై హామీలిచ్చి కొందరు పదవులు చేపట్టారని మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పసుపు రైతుకు మద్దతు ధర లభించిందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకూ కాంగ్రెస్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కోటి కొలువులేమైనయ్..
నిరుద్యోగులకు కోటి కొలువులు, రైతును రాజు చేస్తానన్న సీఎం కేసీఆర్ మాటలేమయ్యాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ఏకకాలంలో రుణమాఫీ జరగలేదన్నారు. రైతులందరూ ఏకమై రైతాంగ ఆకాంక్షలు నెరవేరేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనైనా పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.
Must Read ;- పసుపు రాజకీయం ఎంపీ మెడకు ఇందూరు ఉచ్చు!