హీరోల కొడుకులు హీరోలుగా మారుతున్నారు. కేవలం హీరోలనే కాదు, చాలామంది నటీనటులు తమ
పుత్రరత్నాల్ని వెండితెరకు పరిచయం చేశారు. హిట్ కొట్టారా, ఫెయిల్ అయ్యారా అనే విషయాన్ని పక్కనపెడితే.. అంతా ఓ ప్రయత్నమైతే చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఉత్తేజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మాజీ లాంటి వాళ్లంతా తమ వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.మరి ఇంత అనుభవం ఉండి, ఇంత పేరు సంపాదించుకొని, పుష్కలంగా వనరులన్నీ ఉన్న రాజేంద్రప్రసాద్, ఎందుకు తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. హీరోగా కాకపోయినా కనీసం నటుడిగానైనా పరిచయం చేసి ఉంటే బాగుండేది కదా. మరి ఎందుకు ముఖం చాటేశారు.
నిజానికి తన కొడుకును ఇండస్ట్రీకి గ్రాండ్ గా పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ కు కూడా ఉండేది. కొడుకు బాలాజీ ప్రసాద్ కు ఇష్టం లేకపోయినా, మెల్లగా అతడి మనసు మార్చారు. తన వారసుడ్ని గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ సెంటిమెంట్ కూడా ఫాలో అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోను వెండితెరకు పరిచయం చేసిన రామోజీ రావు చేతుల మీదుగా తన కొడుకును కూడా హీరోని చేయాలనుకున్నారు.
రామోజీరావుతో సంప్రదింపులన్నీ అయిపోయాయి. నిధి ప్రసాద్ ను దర్శకుడిగా కూడా తీసుకున్నారు. తనయుడి కోసం తన అనుభవాన్ని రంగరించి మంచి కథ కూడా సెలక్ట్ చేసుకున్నారు. ఓ మంచి ముహూర్తం కూడా సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తిచేసిన తర్వాత సినిమాను పక్కనపెట్టేశారు రామోజీరావు.
దీంతో ఇటు రాజేంద్రప్రసాద్, అటు బాలాజీ ప్రసాద్ ఇద్దరూ నిరాశచెందారు. బాలాజీ అయితే తన మొదటి ప్రయత్నమే ఇలా అయిందేంటంటూ కాస్త సెంటిమెంట్ ఫీల్ అయ్యారు. ఇక తనకు సినిమాలు అచ్చిరావని మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. అప్పటికే కొడుక్కి ఇష్టం లేకపోయినా ఒప్పించిన రాజేంద్రప్రసాద్, ఈ ఘటనతో ఇక బాలాజీని ఫోర్స్ చేయలేకపోయారు.
అలా వెండితెరకు పరిచయం అవ్వకుండానే తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు బాలాజీ. పూర్తిగా వ్యాపార రంగంలో స్థిరపడిపోయారు. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి, ఇంకెన్నో ప్రశంసలు, పురష్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్ కు ఏదైనా వెలితి ఉందంటే.. అది కొడుకు నటనారంగంలోకి రాకపోవడమే. బహుశా ఇది రాజేంద్రప్రసాద్ కు తీరని కోరికే కావొచ్చేమో.
Must Read ;- మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య దర్శకత్వం?











