నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల రోజుకో లేఖ ద్వారా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారును ఇరుకున పెట్టేయత్నం చేస్తున్నారు. సీఐడీ పోలీసుల అరెస్టు, దాడి ఆరోపణ, బెయిల్ వ్యవహారం తరవాత ధిల్లీ చేరిన రఘురామకృష్ణంరాజు ఇప్పటికే ప్రభుత్వానికి పలు లేఖలు రాయగా తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మరో లేఖ రాశారు. ఒకరకంగా చెప్పాలంటే పైకి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు మద్దతు ఇచ్చినట్టు కనిపిస్తున్నా చాలామంది పదవులకు ఎసరు పెట్టే కార్యక్రమం అని చెప్పవచ్చు.
ఏపీలో శాసన మండలిని రద్దు చేస్తూ గత ఏడాది ఏపీ శాసనసభలో తీర్మానం చేసింది. మెజార్టీతో శాసనసభ, గవర్నర్ ఆమోదం పొందిన ఆ తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలిపితేనే శాసన మండలి రద్దవుతుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ తీర్మానాన్ని ఆమోదించి తమ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కి లేఖ రాశారు. అయితే కేంద్రం వద్ద శాసనమండలి రద్దు తీర్మానం ఎందుకు పెండింగ్‌లో ఉందనే అంశంపై పలు విధాల చర్చ నడుస్తోంది. రానున్న కాలంలో ఎమ్మెల్సీలు వైసీపీకి చెందినవారే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో శాసనమండలి రద్దు నిర్ణయం అమలు కాకుంటే బాగుంటుందనే అభిప్రాయం అధికార పార్టీలోని చాలా మందిలో వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితులు ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు లేఖ రాయడంతో వైసీపీ షాక్ తిందని చెప్పవచ్చు.
శాసనమండలి రద్దుకు కట్టుబడి ఉన్నామంటూ..
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో శాసన మండలి రద్దు నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రఘురామకృష్ణరాజు అటు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి, కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌కి లేఖలు రాశారు. మండలి రద్దుపై సజ్జల వ్యాఖ్యలకు అభినందనలు తెలపడంతో పాటు వారి కోరిక మేరకు ఓ ఎంపీగా తాను కూడా శాసన మండలి రద్దు కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. మండలిని రద్దు చేస్తే జగన్ సర్కారుపై, సజ్జలపై గౌరవం పెరుగుతుందన్నారు. మండలి నిర్వహణకు రూ. 60 కోట్ల ఖర్చు వృథా అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ శాసన మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపినందున, దానికి అనుగుణంగా మండలి రద్దు కోసం పార్లమెంటులో తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తానన్నారు. పార్లమెంటులో స్పీకర్‌తో పాటు ఎంపీల్ని కలిసి లాబీయింగ్ చేస్తానని చెప్పారు. బీజేపీ పెద్దల్ని కలిసి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరతానన్నారు. ఈ లేఖతో వైసీపీ షాక్ తిందని చెప్పవచ్చు. ఈ తీర్మానంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Must Read ;- చిక్కుల్లో జగన్.. వైసీపీ వర్గాల్లో టెన్షన్!
వైసీపీ సభ్యులకు..
శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపాక పలుమార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ధిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులను, ముఖ్యులను కలిసినా మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరినట్టు చర్చ జరగలేదు. ఇక తీర్మానం విషయానికి వస్తే.. ఆ తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలపకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వైసీపీకి 151సీట్లు ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో 87 శాతం ఎమ్మెల్సీలు వైసీపీకే దక్కే పరిస్థితి ఓ వైపు ఉండగా ఆ తీర్మానానికి ఆమోదం తెలిపితే ఈ ఎమ్మెల్సీలన్నీ రద్దవుతాయి. వెరసి రెండు వైపులా వైసీపీకి నష్టం జరుగుతుందనే అంచనాలున్నాయి. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీకి కొంత నష్టమనే చెప్పవచ్చు. రఘురామకృష్ణంరాజు కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా ఈ లేఖ రాశారని చర్చ నడుస్తోంది. గతేడాది జనవరి 27న శాసనసభలో శాసన మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కరోజు చర్చతోనే తీర్మానాన్ని ఆమోదించింది. గవర్నర్ ఆమోదం లభించాక కేంద్రానికి పంపింది. అప్పటి నుంచి కేంద్రం వద్ద ఈ విషయం పెండింగ్‌లో ఉంది.
ఇక అన్న క్యాంటిన్లపైనా రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖ చర్చకు కారణమైంది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తెరవాలని, జగనన్న లేదా రాజన్న పేరుతో పునఃప్రారంభించాలని ఆయన కోరారు. అన్నం పర బ్రహ్మస్వరూపమని అన్ని గ్రంధాల్లో ఉందని, అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానమని, అలా అన్నదానం చేస్తే జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావడంతోపాటు దైవదూతగా జనానికి గుర్తుంటారని పేర్కొన్నారు.
Must Read ;- రెండేళ్లలో ఒరిగిందేమిటీ..? : జగన్ కు మావోయిస్టుల లేఖ