మాజీ ఎంపీ విజయశాంతి ప్రజాభిమానం ఉన్న మహిళా నాయకురాలు. అసలు ఇప్పుడు ఈమె ఏ పార్టీలో ఉందో కూడా ఎవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. తను కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతోందా? లేక బీజేపీలోకి చేరిపోయిందా? అనేదానిపై పార్టీ వర్గాల్లో స్పష్టత కరువైంది. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. బీజేపీకి అనుకూలమైన ప్రకటనలు చేస్తూ బీజేపీలో తాను చేరబోతున్నట్లు స్పష్టతను కూడా ఆమె ఇప్పటికే ఇచ్చేశారు. బీజేపీ నేతలతో పలుసార్లు భేటీలు, సంప్రదింపులు సైతం జరిగాయి. దాంతోపాటు ఆమె ఈ మధ్య ఢిల్లీకి కూడా వెళ్లొచ్చారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో పాటు మరికొంత మంది నేతలతో భేటీ అయి పార్టీలో చేరే విషయంపై చర్చించినట్లు తెలిసింది.
విజయశాంతి రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచే ప్రారంభమైంది. తన మాతృపార్టీ కూడా బీజేపీయే కావడవంతో తనకున్న పాత పరిచాయాలతో బీజేపీలోకి చేరేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారని అంతా భావించారు. ఈక్రమంలోనే బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ విజయశాంతిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె కూడా ఈ విషయంపై సుముఖంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈమేరకే ఢిల్లీకి కూడా వెళ్లొచ్చింది. ఇక ఆమె పార్టీ మారడం ఇక దాదాపు ఖాయమైనట్లేనని అంతా అనుకున్నారు. అయితే విజయశాంతి ఢిల్లీకి వెళ్లొచ్చి సైలెంట్ ఎందుకయ్యారనేది ఇప్పుడు చర్చ.
ఏ నేతలైనా తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరుతున్నప్పుడు ముందస్తుగానే ఏ పదవి ఇస్తారనే దానిపై ఒక హామీని తీసుకుంటారు. ఆ మేరకే పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. విజయశాంతి పార్టీ మారే విషయంలో బీజేపీ ఇచ్చిన ఆఫర్ విజయశాంతికి నచ్చలేదా? లేకుంటే తనకు ఫలానా పదవే కావాలనే విషయంలో విజయశాంతి పెట్టిన షరతు ఆ పార్టీ పెద్దలకు నచ్చలేదా? అనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికలు మరో నాలుగైదు రోజుల్లో ముగుస్తాయి కూడా. దీనికి ముందే ఈమె బీజేపీ పార్టీలో చేరితే ఆ పార్టీకి ప్లస్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఆకర్షించి ఓట్లను మలుచుకునే వీలుంది. కానీ ఎన్నికలు కూడా అయిపోవడానికి వస్తున్న నేపథ్యంలో విజయశాంతి ఇంకెప్పుడు బీజేపీలో చేరుతారనే ప్రశ్న రాజకీయ నాయకుల మదిలో మెదులుతోంది. అసలు పార్టీ మారుతారా? లేదా?. తను ఎప్పుడు జాయిన్ అవ్వాలో అనే దానిపై విజయశాంతికి స్పష్టత కరువైందని కూడా పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ఆ ప్రకటన రెండు పార్టీల ఓటర్లను బీజేపీ దగ్గరకు చేరుస్తుందా..?











