పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను చూసేందుకు మెగా కుటుంబం పోటీ పడింది. మెగా కుటుంబ సభ్యులంతా ప్రత్యేకంగా ఈ షోను వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ సినిమాపై ప్రత్యేకంగా తన స్పందనను తెలియజేశారు. తన తల్లి అంజనాదేవితో కలిసి చిరంజీవి ఈ సినిమా చూశారు. ట్విట్టర్ ద్వారా తన స్పందనను ప్రకటించారు. ‘మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజలి, అనన్య ఆ పాత్రల్లో జీవించారు.

థమన్ , డీఓపీ వినోద్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీ కపూర్.. దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నిటికీమించి ఇది మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరో విశేషమేమిటంటే మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహంలో చిత్రయూనిట్ కలిసింది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ లను చిరంజీవి అభినందించారు.

ఈ సందర్భంగా ఇద్దరికీ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అభినందనలు తెలిపారు. నివేదా థామస్ నటనను ఆయన ప్రశంసించారు. పవర్ ప్యాక్డ్ సినిమాగా ట్విట్టర్ లో రామ్ చరణ్ పేర్కొన్నారు. నాగబాబు తన సతీమణితో కలిసి సినిమా చూశారు. మెగాస్టార్ తనయ సుస్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులంతా ఈ సినిమాని వీక్షించారు.
Must Read ;- ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ












