ఒకటి కాదు, రెండు కాదు.. ప్రభాస్ చేతిలో ఏకంగా 3 సినిమాలున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఆ
మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ఇంతకుముందు ప్రభాస్ కెరీర్ లో ఎప్పుడూ ఇలా
జరగలేదు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే ఇంకో సినిమా మొదలుపెట్టేవాడు. ఇక బాహుబలి టైమ్ లో
ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల పాటు దానికే అంకితమైపోయాడు. ఇలాంటి హీరో నుంచి ఒకేసారి 3 సినిమాలు
సెట్స్ పైకి రావడంతో ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
లాక్ డౌన్ తర్వాత ఏ సినిమా ముందుగా మొదలవుతుందనే సందేహాలు అందర్లో ఉన్నాయి. ప్రభాస్ నుంచి ముందుగా సెట్స్ పైకి వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈనెల 15 తర్వాత ముంబయిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనడం లేదు. సినిమాలో రావణాసురుడి పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ పై ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ముంబయి షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో కూడా ఓ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ మొదలవుతుంది. అయితే
ఇందులో కూడా ప్రభాస్ పాల్గొనడం లేదు. ప్రభాస్ తో సంబంధం లేని సన్నివేశాల్ని తీయబోతున్నారు.
లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్, సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ మధ్య సీన్స్ తీయబోతున్నారు. మరి ప్రభాస్ ఏ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు? లాక్ డౌన్ తర్వాత సలార్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు ఈ హీరో. ఈ మేరకు కాల్షీట్లు కేటాయించాడు కూడా. జులై నుంచి సెట్స్ పైకి వస్తానని దర్శకుడు ప్రశాంత్ నీల్ కు చెప్పేశాడు.
ఇక సెప్టెంబర్ నుంచి ఆదిపురుష్ సెట్స్ పైకి షిఫ్ట్ అవుతాడు ఈ హీరో. అయితే ఈ గ్యాప్ లో రాధేశ్యామ్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు ప్రభాస్. రెండేళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 4-5 రోజుల షెడ్యూల్ పెండింగ్ లో ఉంది. ప్రభాస్-పూజా హెగ్డేలపై ఓ సాంగ్ తీయాల్సి ఉంది. సలార్, ఆదిపురుష్ కంటే ముందు ఈ సినిమాను ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. 4 రోజుల పనే కాబట్టి, మేకర్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడెళ్లి ఆ షెడ్యూల్ ను పూర్తిచేయడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు. ప్రస్తుతానికైతే ప్రభాస్ సినిమాల ఆర్డర్ ఇదే.
Must Read ;- 2050లోకి ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రయాణం