అందం, అభినయం రెంటింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ.. క్రేజీ మూవీస్ తో సౌత్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ‘జెర్సీ’ సినిమాలోని పెర్ఫార్మెన్స్ తో తెలుగుప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో సిద్ధూ జొన్నలగడ్డతో ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీని బాగా వర్కవుట్ చేసింది. అంతకు ముందు అజిత్ తమిళ చిత్రం ‘నేర్కొండ పార్వై’ లో ఒక బోల్డ్ కేరక్టర్ తో అందరికీ షాకిచ్చింది. అలాంటి అమ్మడు ఇప్పుడు మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సరసన కథానాయికగా నటిస్తూండడం సౌత్ లో హాట్ టాపిక్ అయింది.
నిజానికి 2015 లో శ్రద్ధా శ్రీనాథ్ కోహినూర్ అనే మలయాళ మూవీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అందులో అసిఫ్ ఆలీ, ఇంద్రజిత్ సుకుమారన్ హీరోలుగా నటించారు. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఐదేళ్ళకు ఇప్పుడు ఏకంగా మోహన్ లాల్ సరసనే కథానాయికగా నటించబోతుండడం మాలీవుడ్ లో విశేషంగా మారింది. బి.ఉన్నీకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ మూవీకి పులిమురుగన్ ఫేమ్ ఉదయ్ కృష్ణన్ స్ర్కిప్ట్ అందిస్తున్నాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ ఐఏయస్ ఆఫీసర్ గా నటించనుండడం మరో విశేషం. వచ్చే నెల్లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా శ్రద్ధా శ్రీనాథ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.