గత కొంత కాలంగా బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్సీబీ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకమంది హీరో, హీరోయిన్లను, సినీ ప్రముఖులను విచారించారు ఎన్సీబీ అధికారులు. కాగా గతవారం ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ను, గాబ్రియేలా డెమిట్రియాడెస్ ను ఎన్సీబీ అధికారులు రెండు సార్లు విచారించారు. అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత ఫెరోజ్ ఎ. నడియాడ్ వాలా భార్యను కూడా అరెస్ట్ చేసారు. తాజాగా శుక్రవారం రాత్రి ఎన్సీబీ అధికారులు ముంబయిలోని పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక డ్రగ్స్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఎన్సీబీ అధికారులు తమదైన శైలిలో విచారించగా బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్ పేరు బయటకు వచ్చింది.
Must Read ;- ‘మేల్ ప్రెగ్నెన్సీ’పై బాలీవుడ్ ప్రయోగం
వెంటనే శనివారం నాడు అంధేరిలోని ఆమె ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు అనంతరం భారతి సింగ్ ను, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో ఆమె మరికొంతమంది పేర్లు చెప్పిందని సమాచారం. ఆమె చెప్పిన పేర్లను ఆధారంగా చేసుకొని మరొక లిస్ట్ ను తయారు చేసే పనిలో పడ్డారు ఎన్సీబీ అధికారులు. అంతేకాకుండా సోదాల సమయంలో భారతి ఇంటి నుండి కీలక పాత్రలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. తాజా సోదాలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఎంతమంది పేర్లు బయటికి వస్తాయో అని బాలీవుడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.
అయితే బడా బడా వ్యక్తులను వదిలేసి చిన్న చిన్న వ్యక్తులను కావాలనే ఎన్సీబీ అధికారులు పట్టుకొని విచారించి అరెస్ట్ చేస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించడం కోసమే ఈ విధంగా చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికీ ఒక్క బడా హీరో పేరు కూడా బయటకు రాకపోవడం విడ్డురంగా ఉందని వారు అంటున్నారు. చివరికి ఈ కేసు కూడా ఎన్సీబీ అధికారులు నీరుగార్చేలా ఉన్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి నెటిజన్ల ట్రోల్స్ కు ఎన్సీబీ అధికారులు ఎటువంటి సమాధానం చెపుతారో చూడాలి.
Also Read ;- బాలీవుడ్ చిత్రాల్లో హైదరాబాద్ భామ అమ్రిన్ ఖురేషి










