హాస్య నటులెందరో హీరోలుగా పరిచయమవడం పాతతరం నుంచి నేటితరం వరకు చూస్తున్నదే. ఈ కోవలోనే గెటప్ శ్రీను కూడా హీరో అయ్యారు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న ఆయనకు సినిమాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఆ మధ్య సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లతో కలసి “త్రీ మంకీస్“ చిత్రంలో ముగ్గురు హీరోలలో ఒక హీరోగా నటించారు. తాజాగా సోలో హీరోగా నటించే అవకాశం గెటప్ శ్రీనును వెతుక్కుంటూ వచ్చింది. ఆలా ఆయన సోలో హీరోగా నటిస్తున్న చిత్రం “రాజు యాదవ్” .

ఇందులో గెటప్ శ్రీను సరసన అంకిత కరత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. చెన్నై ఐఐటీలో ఇంటర్నేషనల్ స్క్రీన్ రైటింగ్ కోర్సు చేసిన తర్వాత ‘విన్సెంట్ ఫెరర్’ అనే స్పానిష్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన అనంతరం తెలుగులో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన ‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం‘ చిత్రాలకు చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన కృష్ణమాచారి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం నేడు ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు సాగర్ కె.చంద్ర క్లాప్ నిచ్చారు.దర్శకుడు వేణు ఊడుగులతో పాటు నిర్మాత సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సంయుక్తంగా స్క్రిప్టును చిత్ర దర్శకుడికి అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ, ఒక పట్టణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సహజత్వానికి దగ్గరైన పాత్రలతో, ఆర్గానిక్ నిర్మాణంలో మలచబోతున్నాం. ఇంకా చెప్పాలంటే వ్యాపార విలువలకు దూరంగా ఉంటూ… సమాజంలో మనం చూసే ఎంతోమంది వ్యక్తులకు సామీప్యంగా ఉంటూ సగటు కుటుంబంలోని రకరకాల మనస్తత్వాలు, వారి కోరికలు, ఊహలు, ప్రయాణం వంటివాటిని ఆవిష్కరిస్తూ , చివరకు కథ ఈ గమ్యానికి చేరుకుంది అన్నది చాలా ఆహ్లాదభరితంగా చూపించబోతున్నాం మంచి కథ. ఆ;అలాగే తాను చేయబోయే పాత్ర నచ్చడంతో వెంటనే గెటప్ శ్రీను అంగీకరించారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయాలన్న తలంపుతో పాత్రకు అనుగుణంగా తన బాడీని తీర్చిదిద్దుకుంటున్నారు. అంతేకాదు పాత్రలో సహజత్వంగా నటించేందుకు పరిశోధన కూడా చేస్తున్నారు. దీని ద్వారా గెటప్ శ్రీనులోని కొత్త నటుడు తప్పనిసరిగా కనిపిస్తాడు అని దర్శకుడు చెప్పారు. నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ , డిసెంబర్ తొలి వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణను మొదలు పెడతామని అన్నారు. .అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, సాక్ష్యం వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక కాగా రూపాలక్ష్మి,ఆనంద్ చక్రపాణి, ఉన్నతి, ప్రశాంత్, ఉత్తర, సంతోష్ రాజ్, పవన్ రమేశ్ తదితరులు ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సాయిరామ్ ఉదయ్, ఎడిటింగ్ ను బొంతల నాగేశ్వర్ రెడ్డి అందిస్తున్నారు.
Must Read ;- జబర్దస్త్ టీమ్ లీడర్ కు కరోనా పాజటివ్.. నిజమేనా?











