సెన్సిటివ్ కథలతో, సెన్సిబుల్ చిత్రాలు తీయడంలో శేఖర్ కమ్ముల చెయితిరిగిన దర్శకుడు. సున్నితమైన భావోద్వేగాలు , చక్కటి సన్నివేశాలు.. మనసును ఆహ్లాద పరిచే సంభాషణలు ఆయన సినిమాలకు ఆయువు పట్టుగా నిలుస్తాయి. అలాంటి ఓ అద్భుతమైన ప్రేమకథా చిత్రం ‘గోదావరి’. సుమంత్, కమలినీ ముఖర్జీ, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ఉవ్వెత్తున ఉప్పొంగిన ఈ గోదావరి.. ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చేలో వరిలా ఉగుతునే ఉంది. 2006, మే 19న విడుదలైన గోదావరి చిత్రం సరిగ్గా నేటికి 15 ఏళ్ళు పూర్తిచేసుకుంది.
సీతా మహాలక్ష్మి (కమలినీ ముఖర్జీ ) ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి. సొంతంగా తన కాళ్ళమీద తాను నిలబడాలని బొటిక్ వ్యాపారం చేస్తూంటుంది. అయితే అందులో నష్టాలొచ్చినా.. అతి కష్టం మీద నెట్టుకొని వస్తూంటుంది. ఒకవైపు తల్లిదండ్రులు చూసే పెళ్ళి సంబంధాల్ని ఏదో ఒక వంకతో తిరస్కరిస్తూంటుంది. ఇక రామ్ (సుమంత్) అమెరికాలో చదువుకొని.. రాజీకీయాల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటూంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే.. అమ్మమ్మ, మమయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ (నీతూ చంద్ర ) అంటే రామ్ కి ఎంతో ఇష్టం. అయితే.. మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని మేనమామ అతనికి పిల్లనివ్వడానికి అంగీకరించడు. ఇంతలో రామ్ కి రాజమండ్రి నుంచి భద్రాచలం ప్రయాణంలో సీతా మహాలక్ష్మి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇష్టంగా మారుతుంది. ఇంతకీ రామ్ .. సీతా మహాలక్ష్మి ఎలా ఒకటవుతారు అనేదే మిగతా కథ.
దర్శకుడు బాపు.. అక్కినేనితో అందాల రాముడు సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మొత్తం రాజమండ్రి టు భద్రాచలం లాంచీ ప్రయాణంతోనే సాగుతుంది. అయినా ఏ మాత్రం బోరు కొట్టించక, వీనుల విందైన పాటలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. ఆ సినిమా స్ఫూర్తితోనే శేఖర్ కమ్ముల గోదావరి సినిమా రూపొందించారు. రాజమండ్రి టు భద్రాచలం వరకూ సాగే ఈ లాంఛీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు, ఇంకెన్నో భావోద్వేగాలు. ఆ క్రమంలో ఎన్నో సుందరమైన అందాలు, ఎంతో సున్నితమైన మనసులు.. కుటుంబ బంధాల్ని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించి.. ఫీల్ గుడ్ మూవీగా దీన్ని తెరకెక్కించారు శేఖర్ కమ్ముల.
కే.యమ్. రాధాకృష్ణన్ సంగీతం, వేటూరి పాటలు గోదావరి చిత్రానికి ప్రాణం పోశాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వింటుంటే.. మన మనసుల్ని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఇక ఇందులో కమలినీ ముఖర్జీకి సింగర్ సునీత వాయిస్ అద్భుతంగా కుదిరింది. అలాగే.. సుమంత్ పాత్ర ఎంతో మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది. చాలా సెటిల్డ్ గా రామ్ పాత్రను పోషించారు ఆయన. ఇక ఇందులో ఒక కుక్కని కూడా ప్రధాన పాత్రగా చేశారు శేఖర్ కమ్ముల . పైగా దానికి తనే డబ్బింగ్ చెప్పారు దర్శకుడు శేఖర్. ఏకంగా ఆరు నంది అవార్డుల్ని సొంతం చేసుకున్న ‘గోదావరి’ చిత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీనే.
Must Read ;- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సీనియర్ హీరో ?











