కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపినా సీఎం జగన్ చలించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఇతర డిమాండ్లతో టీడీపీ చేపట్టిన ‘సాధన దీక్ష’ ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మృతుల వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాకు ప్రపంచమంతా భయపడితే జగన్ తేలిగ్గా తీసుకున్నారని అన్నారు. కరోనా నుంచి బయట పడేందుకు వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్‌కు కూడ కులం ఆపాదించారని మండిపడ్డారు.
సూచనలు పట్టించుకోకుండా టీడీపీ నేతలపై కేసులు
‘‘ప్రపంచం మొత్తాన్ని కరోనా భయభ్రాంతుల్ని చేసింది. బాధ్యత గల ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మా సూచనలను సీఎం జగన్ పట్టించుకోలేదు. కరోనా వచ్చిన తొలిరోజుల్లోనే నేను సూచనలు చేస్తే అవహేళన చేశారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని సీఎం చెప్పారు. కరోనా ఆంక్షలు సాకుగా చూపి టీడీపీ నేతల్ని ఇబ్బంది పెట్టారు. కరోనా సమయంలో ఎంతోమంది బాధితులకు టీడీపీ ధైర్యం చెప్పింది. ఐదు కోట్ల మంది ఆరోగ్యంపై ఆలోచించాలని చెబితే మాపై తప్పుడు కేసులా? పది, ఇంటర్ విద్యార్థుల పరీక్షల పట్ల వితండవాదం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారు. సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో తోక జాడించారు. లేని ‘దిశ’ చట్టానికి యాప్, వాహనాలు, పోలీసు స్టేషన్లా? సీఎం ఇంటిపక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోలేదు. టీడీపీ చేపట్టిన ‘సాధన దీక్ష’ నుంచి దృష్టి మళ్లించేందుకే ‘దిశ’ కార్యక్రమం చేపట్టారు.
కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు
కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. కొవిడ్ మృతుల పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా. మూడో దశ హెచ్చరికలున్నా ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. కరోనా తీవ్రతలోనూ మద్యం దుకాణాలు తెరిచి దుర్మార్గంగా వ్యవహరించారు. తప్పుడు కేసులతో పోలీసు వ్యవస్థ విశ్వాసం కోల్పోయింది. శ్మశానాల్లో రిజర్వేషన్లు, అంత్యక్రియల ధరలు పెంచారు. రైతులు, కార్మికులు పనిలేక పస్తులుంటున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ‘సాధన దీక్ష’
కొవిడ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఏపీ వ్యాప్తంగా టీడీపీ ‘సాధన దీక్ష’ ప్రారంభమైంది. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు దీక్ష ప్రారంభించారు. ‘సాధన దీక్ష’ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ దీక్ష కొనసాగింది.
కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో సుమారు కోటి మంది ఉపాధి కోల్పోయారని టీడీపీ పేర్కొంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేల తక్షణ సాయం అందించాలని, కరోనా పరిస్థితులు కొనసాగినంతకాలం ఆయా కుటుంబాలకు రూ.7,500 ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. కొవిడ్‌తో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ఆక్సిజన్ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలనే డిమాండ్లతో టీడీపీ ‘సాధన దీక్ష’ చేపట్టింది.
Must Read ;- ఫేక్ సీఎం జగన్ ప్రచార బూటకం : చంద్రబాబు











