Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy’s Harsh Remarks On TDP Leaders :
జేసీ బ్రదర్స్ రాజకీయమే చాలా భిన్నంగా ఉంటుంది. ఏ ఒక్క రాజకీయ నేతలకు లేని ప్రత్యేకత జేసీ బ్రదర్స్ కు రావడానికి కారణం కూడా అదేనని చెప్పాలి. అసలు ఎప్పుడు బయటకు వస్తారో, వచ్చి ఏం చేస్తారో, జనాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో కూడా ఒక పట్టాన అర్థం కాదు. ఎందుకోసం వచ్చారో.. దానిని పక్కన పడేసి వేరే అంశాన్ని ఎత్తుకుని జేసీ బ్రదర్స్ తమదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపుతారు. ఆ వెంటనే అదృశ్యమైపోతారు. అన్న జేసీ దివాకర్ రెడ్డి ఓ మోస్తరు ఫరవా లేదనుకున్నా.. తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం కాస్త డిఫరెంటేనని చెప్పాలి. తాను ఉంటున్న పార్టీ అధికారంలో ఉందా? లేదంటే విపక్షంలో ఉందా? అన్న మాటనే వీరు పట్టించుకోరనే చెప్పాలి. మొత్తంగా పార్టీ లైన్ ను అంతగా పట్టించుకోకుండా సాగే జేసీ బ్రదర్స్.. తమ సొంత అజెండా మేరకే సాగుతారని కూడా చెప్పాలి.
సొంత పార్టీపై విమర్శలా..?
అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. టీడీపీలో కొనసాగుతూనే అదే పార్టీపై జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులను పట్టించుకునే నేతలు లేరంటూ ఆయన టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ప్రాజెక్టుల సదస్సుల పేరిట పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసులతో కుమ్మక్కు అయ్యారంటూ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను నరసరావుపేటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అనంతపురంలో టీడీపీ నేతలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల సదస్సుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ తలాతోకా లేని ప్రశ్నలు సంధించారు. ఓ వైపు పార్టీ సదస్సుకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చినా.. రెండేళ్లుగా ఒక్క కార్యకర్తని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రాజెక్టుల సదస్సులకు రమ్మంటే కార్యకర్తలు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో పార్టీకి పటిష్ట కేడర్ ఉందని.. టీడీపీకి అనంతపురం జిల్లా కంచుకోట అని పేర్కొన్న జేసీ.. అలాంటి పార్టీ పటిష్టతకు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారని కూడా జేసీ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
జగన్ జమానాలో రాయలసీమకు ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతోందని జేసీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డితో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఎంవీ మైసూరారెడ్డిని కూడా కలిశారు. అందరం కలిసి ఏదో ఒకట చేయకపోతే.. రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని కూడా ఆయన భావిస్తున్నారు. దీనిపై పోరుకు టీడీపీతో పాటు ఇతర పార్టీల నేతలను కూడా కూడగట్టే దిశగా సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయనకు సమాచారం ఇచ్చారో, లేదో తెలియదు గానీ.. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నీటి వాటాల్లో సీమకు జరుగుతున్న అన్యాయంపై రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ నుంచి ప్రధాన నేతలంతా హాజరయ్యారు. పార్టీ శ్రేణులు కూడా ఈ సమావేశంపై ఆసక్తి చూపించాయి. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే.. మరోవైపు మీడియా ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జేసీ బ్రదర్స్ 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. వైసీపీలోకి వీరు చేరిపోతారని అంతా భావించినా.. జగన్ తీరు నచ్చకపోవడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపుగా జీరో స్థాయికి చేరిపోవడంతోనే రాజకీయ భవిష్యత్తు కోసమే వీరు టీడీపీలో చేరారు. అలాంటిది ఇప్పుడు జేసీ బ్రదర్స్ అధికార పార్టీపై విరుచుకుపడాల్సిందిపోయి.. విపక్షంలో ఉన్న తమ సొంత పార్టీపై విమర్శలు గుప్పించడం గమనార్హం.
Must Read ;- అభాగ్యులకు అండ లోకేశే, జగన్ కాదు











