Tuck Jagadish Movie Review :
నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘టక్ జగదీష్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఇంతకుముందు నాని నటించిన వి చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘టక్ జగదీష్’ చిత్రాన్నిషైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
గ్రామీణ కక్షల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. భూదేవిపురం అనే ఊరికి వచ్చే ఎంఆర్ఓని చంపేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊళ్లో ఉండే వీరింద్రనాయుడు (డానియల్ బాలాజీ) ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటాడు. అదే ఊరిలో ఉండే ఆదిశేషులునాయుడు (నాజర్)కు ఇలాంటివి ఇష్టముండదు. ప్రజల అభిమానం ఆదిశేషులు నాయుడి వైపే ఉంటుంది. ఆయన కుమారుడే జగదీష్ (నాని). అతను పట్నంలో ఉంటాడు. అతని అన్నయ్య బోసుబాబు (జగపతి బాబు) తండ్రి వద్దే ఉంటాడు.
జగదీష్ కు టక్ చేసుకునే అలవాటు. టక్ ఉన్నంతవరకే అతని కోపం అదుపులో ఉంటుంది. ఎమ్మార్వోతో కుమ్మక్కై వీరేంద్ర ఆ గ్రామంలో ఉన్న భూముల్ని కాజేస్తూ ఉంటాడు. ఆదిశేషులు నాయుడు కుటుంబానికీ, వీరేంద్రనాయుడు కుటుంబానికీ పడదు. ఆదిశేషులు నాయుడు చనిపోవడంతో పెద్ద కుమారుడు బోసుబాబులో స్వార్థం బయలుదేరుతుంది.
వీరేంద్రనాయుడుతో కలిసి తండ్రి ఇచ్చిన ఆస్తిని జగదీష్ తో పాటు చెల్లెళ్లకు ఇవ్వకుండా కాజేయాలనుకుంటాడు. పైగా మేనకోడలు చంద్రమ్మ (ఐశ్వర్యా రాజేష్)ను వీరేంద్ర తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ విషయం జగదీష్ కు తెలియకుండా జాగ్రత్త పడతాడు. మధ్యలో టక్ జగదీష్ ప్రేమ ట్రాక్ ఒకటి. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ)తో జగదీష్ ప్రేమలో పడతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు ఊరి బాగు కోసం జగదీష్ ఏం చేశాడన్నదే చిత్ర కథాంశం.
ఎలాతీశారు? ఎలా చేశారు?
జగదీష్ చేసే టక్ కూ సినిమాకూ ఎలాంటి సంబంధమూ లేదు. వెరైటీ కోసమే ఈ పేరు పెట్టారనుకోవాలి. టైటిల్ జస్టిఫికేషన్ చేయాలి కాబట్టి ఒక సందర్భంలోనే ఫైట్ తో దాన్ని చూపారు. నాని సినిమా అనగానే వైవిధ్యాన్ని జనం కోరుకుంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్ అతిగా చూపించడం, అతికినట్టు చూపించలేకపోవడం ఈ సినిమాకి మైనస్. మేనకోడలిపై జగదీష్ కు ఉండే మమకారంలోనూ అతి కనిపించింది. అంతా నాటకీయ సన్నివేశాలతో సినిమా నడపాలనుకున్నారు. ఈ తరహా కథలపై బోలెడు సినిమాలు వచ్చాయి.
చదువుకుని తన ఊరికే ఎమ్మార్వోగా ఎలా రాగలుగుతారో డైరెక్టర్ కే తెలియాలి. కొత్తదనం లేని కథ, సాగదీత కథనం ఈ సినిమాను ట్రాక్ తప్పించాయి. జగదీష్ పాత్రకు నాని తన దైన బాణీలో న్యాయం చేశాడు. వీరేంద్రనాయుడు పాత్రకు డేనియల్ బాలాజీ సరిపోలేదు. ముఖ్యంగా అతనికి వేరెవరితోనైనా డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది. చంద్రమ్మ పాత్రకు ఐశ్వర్యా రాజేష్ నే పెట్టనవసరం లేదు. వేరెవరిని పెట్టినా కథకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పైగా ఆమెను అత్యంత ప్రమాదకరంగా అనిపిస్తే ఈ స్విచ్ నొక్కు నేనొచ్చేస్తా అని నాని చెప్పడం అత్యంత నాటకీయంగా అనిపిస్తుంది.
ఆదిశేషులు నాయుడు పాత్ర చనిపోయేవరకూ మంచి వాడిగా కనిపించిన బోసుబాబును అమాంతం క్రూరుడిగా చిత్రీకరించడం కూడా అసహజంగా ఉంది. ద్వీతాయార్థంలో ఆస్తి గొడవలు ఎక్కువై ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. వీఆర్వో పాత్రకు రీతూ వర్మ న్యాయం చేసింది. నాజర్, వీకే నరేష్, రావు రమేష్ లు తమ పరిధి మేరకు నటించారు. సినిమా అంతా చప్పగా సాగింది. కనీసం ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం కూడా చేయలేదు. తిరుమల నాయుడిగా తిరువీర్ నటన ఆకట్టుకుంది. అతనిలో మంచి నటుడున్నాడని మరోసారి నిరూపించాడు. పాటల్లోనూ మాటల్లోనూ పసలేదు.
నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్యారాజేష్, రావు రమేష్, నాజర్, వీకే నరేష్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, ప్రవీణ్, తిరువీర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.
సాంకేతికవర్గం: కెమెరా ప్రసాద్ మూరెళ్ల, సంగీతం తమన్, గోపీసుందర్ (నేపథ్య సంగీతం), ఎడిటింగ్ ప్రవీణ్ పూడి
నిర్మాణం: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల: 10-09-2021
వేదిక: అమెజాన్ ప్రైమ్
ఒక్క మాటలో: టాక్ లేని జగదీష్
రేటింగ్: 2/5