విశ్రాంతి, శుభం.. తెలుగు సినిమాలు చూసే వారికి తెలియని పేర్లు కావివి. మరి విశ్రాంతికి శుభం కార్డు పడితే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ఆ రోజు మనకు దగ్గర్లోనే ఉంది.
కరోనా కారణంగా తెలుగు సినిమా విశ్రాంతి తీసుకుంది. థియేటర్లో సినిమాయే లేనప్పుడు మనకు కూడా ఇంటర్వెల్ ఉండనట్టే కదా. కానీ మేం చెప్పబోయేది అది కాదు. త్వరలోనే థియేటర్లలో సినిమాలు విడుదల కోబోతున్నాయి. అయితే ఇంటర్వెల్ లేకుండానే సినిమా ముగించాలనే విషయం మీద చర్చలు సాగుతున్నాయి. ఇంటర్వెల్ ఉంటే జనం గుంపులు గుంపులుగా వస్తారు.. సామాజిక దూరం ఉండదు. టాయ్ లెట్స్, స్నాక్స్ అమ్మే చోట రద్దీ ఉంటుంది. కరోనా వైరస్ కు ఇక పండగే. అందుకే విశ్రాంతికి శుభం పలకాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
నాన్ స్టాప్ సినిమాలేనా
ప్రయాణాలు నాన్ స్టాప్ గా ఎలా మారిపోయాయో సినిమాలు కూడా అలా మారిపోతాయా? అలా మారిపోతే మరి ఇంటర్వెల్ బ్యాంగ్ మాటేమిటి? అసలు ఈ ఇంటర్వెల్ ఎప్పుడు పుట్టింది?.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పనిలో ఉందాం. అసలు హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ అనేది ఉండేది కాదు. దానికి కారణం వాటి నిడివి తక్కువగా ఉండటమే. తెలుగు సినిమాల నిడివి ఎక్కువ కావడం వల్లే ఇంటర్వెల్ అనేది పుట్టింది.
కథ ప్రారంభం, మలుపులు, ముగింపు.. అనే మూడు అంశాల మీదే ఆధారపడి హాలీవుడ్ సినిమా ఉంటుంది. పాటలు, సుదీర్ఘమైన డైలాగులు ఉండవు కాబట్టి హాలీవుడ్ సినిమా నిడివి గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే ముగిసిపోతుంది. అందుకే ఒకప్పుడు థియేటర్ ఆపరేటర్ తాను ఎంచుకున్న ఓ ప్రదేశంలో ఇంటర్వెల్ ఇచ్చి ఆ తర్వాత స్టార్ట్ చేసేవాడు. స్నాక్స్, టీలు, డ్రింకుల వ్యాపారం కూడా సాగాలి కాబట్టి ఈ తరహా ప్రక్రియ ఏర్పాటైంది.
మూకీల యుగంలోకి వెళదాం..
అసలు ఇంటర్వెల్ అనే పదం పుట్టిందే మూకీల యుగంలో. ఇది హాలీవుడ్ లోనే ప్రారంభమైంది. సినిమాల యుగం ప్రారంభమైంది మూకీల యుగం నుంచే. 1912-20 మధ్య కాలంలో సినిమా పుట్టింది. నాలుగు రీళ్ల సినిమా ఉందనుకుంటే ప్రతి రీలుకూ సినిమా ఆపాల్సి వచ్చేది. అంటే థియేటర్లో ఒక్క ప్రొజెక్టర్ మాత్రమే ఉండేది. రెండు ప్రొజెక్టర్లు ఉంటే ఈ పరిస్థితి ఉండదన్న తెలివితేటలు అప్పట్లో లేవు.
దాంతో ఒక రీలు అయిపోయాక ఇంకో రీలు ఎక్కించాలంటే కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చేది. దీన్ని ఇంటర్వెల్ గా జనం భావించి బయటకు వచ్చేవారు. ఆ తర్వాత ఇండియన్ సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా నిడివి మూడు నుంచి నాలుగు గంటలు ఉండేది. అంతసేపు థియేటర్లో కూర్చుని ఉండటం కూడా కష్టమయ్యేది. అందుకే ఇంటర్వెల్ ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారు. విశ్రాంతి అనే పదం పుట్టింది ఇక్కడే.
రాజ్ కపూర్ సినిమా ‘మేరానామ్ జోకర్’కు రెండు మూడు ఇంటర్వెల్ లు ఇచ్చారని చెప్పుకుంటుండేవారు. ఈ తర్వాత ఈ సినిమా నిడివి కుదించారనుకోండి. అది వేరే విషయం. అలాగే ఆయన నటించిన ‘సంగం’ సినిమాకు కూడా రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అమితాబ్, ధర్మేంధ్రల ‘షోలే’ సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ ఉండేది. అయినా సరే ఒకే ఇంటర్వెల్ కు పరిమితం చేశారు. సినిమాని కూడా బాగా కుదించారు.
Must Read ;- థియేటర్లలో సినిమా ఎప్పుడు చూపిస్తారు మామా?
ఈ బ్యాంగ్ ఏంటి? దీని సంగతేంటి?
మన ఇండియన్ సినిమాకు నవరసాలు ఉండాలి. ప్రేక్షకుడు ఇంటర్వెల్ లో బయటికి వెళ్లేటప్పుడు ఒక ట్విస్ట్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. మన తెలుగు సీరియల్స్ లోనూ ఈ ఒరవడి ప్రారంభమైంది ఒకప్పుడు. యండమూరి లేదా మల్లాది సీరియల్స్ వచ్చే రోజుల్లో ఈ వారం సీరియల్ ముగిసే చోట ఒక సస్పెన్స్ క్రియేట్ చేసేవారు. ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగు సీరియల్స్ కు కూడా పాకింది.
ఈ ట్విస్ట్ కు పెట్టిన పేరే బ్యాంగ్. బయటికి వచ్చిన ప్రేక్షకుడు చర్చించుకునే తరహాలో ఈ బ్యాంగ్ ఉండాలి. ఎంత త్వరగా లోపలికి వెళ్లాలా అనే కుతూహలం పెరగాలి. అలా రూపొందిందే బ్యాంగ్. ప్రేక్షకుడి ఆసక్తి రెట్టింపు కావాలన్న మాట. కథ చెప్పి హీరోలను ఒప్పించేటప్పుడు కూడా ఈ బ్యాంగ్ గురించి ఎంత గొప్పగా చెప్పగలిగితే హీరో అంతగా దీనికి కనెక్ట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ బ్యాంగ్ నచ్చకపోతే హీరోలు కూడా కథలను ఓకే చేయడం లేదు. కొంతమంది ఈ బ్యాంగ్ అనేది ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ సినిమాతోనే ప్రారంభమైందని అంటారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు ఏడాది పాటు ఆడింది. ఇందులో హీరో ఎన్టీఆర్ అడవిలో రాముగా అందరితో కలిసిపోయి ఉంటాడు. ఆ రాము ఎవరో కాదు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ అని రీవీల్ చేసి ఇంటర్వెల్ ముందు ఆసక్తి పెంచారు. ఇదేదో బాగుందే అని అందరూ అనుకున్నారు. దాంతో సినిమాకు కథ ఎంత ముఖ్యమో బ్యాంగ్ కూడా అంతే ముఖ్యం అనేదాకా పరిస్థితి వెళ్లింది.
ఇంకా చెప్పాలంటే ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే బ్యాంగ్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో మనందరికీ తెలుసు. రాజమౌళి లాంటి దర్శకుడు బ్యాంగ్ కు పెద్ద పీట వేస్తుంటాడు. ఇప్పుడు థియేటర్లు లేవు, రేపు ప్రారంభమైనా జనం ఎంతగా వస్తారో తెలియదు. ఇంటర్వెల్ సమయంలో సినిమా పేరుతో మరో పెద్ద వ్యాపారం స్నాక్స్ అమ్మకాలు. విశ్రాంతి లేకపోతే ఈ వ్యాపారానికి చరమగీతం పాడినట్లే.
ఇంకో పక్క కరోనా సెకండ్ వేవ్ భయం.. సినిమా కథల్లోనూ బ్యాంగ్ లతో నిమిత్తం లేకుండా కథలు నడిపే విధానం మీద దర్శకుడు దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివిని మరింత తగ్గించాలన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. మనం బయటికి వెళ్లాలనుకుంటే మనమే ఓ విశ్రాంతిని కలిగించుకోవడమే. కాబట్టి విశ్రాంతికి శుభం కార్డు పడినట్లుగానే భావించాలి. త్వరలోనే దీని మీద అధికారిక ప్రకటన కూడా రావచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉంది.
-హేమసుందర్ పామర్తి