Suryapet ZP CEO Sensational Comments On KCR Government Regarding Opening Of Educational Institutions :
ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందడం లేదన్న వాదనలతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవాలన్న దిశగా తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించినా.. రాష్ట్రంలో ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనమే సాగుతోందన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి విద్యా వ్యవస్థను ఇప్పటికీ ఆంధ్రాకు చెందిన కార్పొరేట్ విద్యా సంస్థలే శాసిస్తున్నాయన్న ఆరోపణలు మరింతగా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు చెందిన సూర్యాపేట జిల్లాలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఓ ప్రభుత్వ అధికారిగా ఉండి కూడా.. కేసీఆర్ సర్కారు తీసుకున్న చర్యలను ప్రేమ్ కరణ్ రెడ్డి బహిరంగంగానే విమర్శించడం నిజంగానే సంచలన రేకెత్తించేదే కదా.
సీఈఓ ఏమన్నారంటే..?
సూర్యాపేటలో జరిగిన ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా ప్రేమ్ కరణ్ రెడ్డి.. అన్ని విద్యా సంస్థలను తెరుస్తూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. **ఆంధ్రోళ్ల పెత్తనమేమిటి? నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు చెప్పినట్టుగా ప్రభుత్వం స్కూళ్లను నిర్వహించడం సిగ్గుచేటు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణలో ఆంధ్రా విద్యా సంస్థల వ్యాపారాన్ని ఆపాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికకు అడ్డొచ్చిన కరోనా స్కూళ్లకు రాదా?. అంగన్ వాడీ నుంచి పీహెచ్ డీ వరకు ఒకేసారి తెరవడం బ్యూరోక్రాట్స్, రాజకీయ నేతల ఆలోచన తీరుకు నిదర్శనం. తెలంగాణలో విద్యా వ్యవస్థ మార్పునకు అవసరమైతే రాజీనామా చేస్తా@@ అని ప్రేమ్ కరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది.
ఈ వాదన సరైనదేనా?
ప్రేమ్ కరణ్ రెడ్డి వ్యాఖ్యలు అలా పక్కనపెడితే.. తెలంగాణలో ఒకే సారి అన్ని రకాల విద్యా సంస్థలను తెరిచిన తీరుపై పలు వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడి అయినా.. ఇంకా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా థర్డ్ వేవ్ ప్రబలితే.. దాని ప్రభావం పిల్లలపైనే అధికంగా ఉంటుందంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకే దఫా అన్ని విద్యా సంస్థలు కాకుండా.. విడతల వారీగా విద్యా సంస్థలను తెరిస్తే బాగుంటుందన్న వాదనలు వినిపించాయి. అయితే కేసీఆర్ సర్కారు మాత్రం అన్ని విద్యా సంస్థలను ఒకేసారి ఓపెన్ చేసేసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొందన్న మాట అయితే వాస్తవమే. ఇలాంటి నేపథ్యంలోనే ప్రేమ్ కరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
చర్యలు షురూ
తెలంగాణ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డిపై చర్యలు షురూ అయ్యాయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో ఇంకా ఆంధ్రా పెత్తనమే సాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రేమ్ కరణ్ రెడ్డిని సూర్యాపేట జడ్పీ సీఈఓ పోస్టు నుంచి తప్పిస్తూ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ కేసీఆర్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించిన సర్కారు.. ఆయనకు మరే పోస్టు కేటాయించలేదు. ఇదిలా ఉంటే.. తానేమీ తప్పు వ్యాఖ్యలు చేయలేదని ప్రేమ్ కరణ్ రెడ్డి వాదించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను వ్యక్తిగతంగా ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
Must Read ;- జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్టే!