ఏపీలోని చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ముందు శుక్రవారం ఉదయం జనమంతా బారులు తీరారు. తమ ఖాతాల్లోని సొమ్ము భద్రంగానే ఉందా? అంటూ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంకొందరైతే.. మా ఖాతాల్లోని సొమ్ము ఇచ్చేయమంటూ భీష్మించారు. అక్కడ మొదలైన గోల చెవిన పడినంతనే.. పోలీసులు పరుగుపరుగున అక్కడికెళ్లారు. ఏం జరిగిందని ఆరా తీసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఇంతకీ అక్కడ జరిగిన కిరికిరి ఏమిటంటే.. ఆ బ్యాంకు పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోని సొమ్మును అందులో పనిచేసే ఓ చిరుద్యోగి దారి మళ్లించేశాడు. మహిళా సంఘాల సొమ్మును తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి తరలించి సొమ్ము చేసుకున్నాడు. ఈ వ్యవహారానికి బ్యాంకులోని కొందరు సిబ్బంది కూడా సహకరించారట. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు.. బ్యాంకు సిబ్బందే ఏదో ఒకటి చేసి ఆ సొమ్మును తిరిగి ఇప్పించేస్తారులే అంటూ ఖాతాదారులకు చెప్పి.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులేమీ చేయవద్దని సూచించారట.
ఈ కిరికిరీ ఏమిటంటే..?
స్వయం సహాయక మహిళా సంఘాలు తమ పరిధిలోని బ్యాంకుల్లో ఖాతాలు తెరచుకుని వాటిలో నెలనెలా కొంత సొమ్మును జమ చేస్తుంటాయి. ఆ సొమ్ము పెరుగుతున్న కొద్దీ అదే బ్యాంకు నుంచి ఆ సంఘాలకు రుణాలు మంజూరవుతూ ఉంటాయి. ఈ రుణాలను వాయిదాల్లో చెల్లించే సంఘాలు.. తమ పొదును కూడా కంటిన్యూ చేస్తుంటాయి. అంటే.. రుణ ఖాతాలు నెలల వ్యవధిలో క్లోజ్ అయిపోతుంటాయి. కొత్త రుణాలు మంజూరు అవుతుంటాయి. అయితే ఆ సంఘాలు పొదుపు చేస్తున్న మొత్తం మాత్రం తమ ఖాతాల్లో అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని ఆసరా చేసుకున్న కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో మెసెంజర్ గా పనిచేస్తున్న చిరుద్యోగి.. సంఘాల ఖాతాల్లో అలాగే ఉండిపోతున్న మొత్తాలను తన కుటుంబ సభ్యుల ఖాతాలకు తరలించేశారు. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది సహకారం లేకుండా ఈ వ్యవహారం నడవదు కదా. ఇలా గుట్టుగా ఎప్పటినుంచి జరుగుతుందో తెలియదు గానీ.. గురువారం నాడు కొన్ని మహిళా సంఘాల సభ్యులు తమ ఖాతాల్లోని తమ పొదుపు మొత్తం జీరోగా ఉండటాన్ని గుర్తించారు. ఇదేమిటని అడిగితే.. చూద్దాంలే అంటూ బ్యాంకు సిబ్బంది కూడా చెప్పారట. అయితే అనుమానం వచ్చిన సంఘాల సభ్యులు ఇతర సంఘాలకు కూడా ఈ విషయాన్ని చేరవేశారు. ఇంకేముంది.. ఆ నోటా, ఈ నోటా విషయం మొత్తం పాకిపోయింది. ఆందోళన చెందిన పొదుపు సంఘాలతో పాటు వ్యక్తిగత ఖాతాలు ఉన్న వారు కూడా శుక్రవారం ఉదయం బ్యాంకు తలుపులు తెరచుకోకముందే.. అక్కడ క్యూ కట్టారు.
ఫిర్యాదు ఎందుకు వద్దన్నారో..?
ఈ వ్యవహారం మీడియాకూ తెలిసిపోవడంతో పలు సంస్థల మీడియా ప్రతినిధులు కెమెరాలు పట్టుకుని అక్కడ వాలిపోయారు. దీనిని గమనించిన పోలీసులు.. మహిళా సంఘాల నిధులు ఎక్కడికీ పోలేదని, ఏదో సాంకేతిక కారణాల వల్లే వారి ఖాతాల్లోని నిధులు కనిపించడం లేదని బ్యాంకు అధికారులు చెప్పినట్టుగా మీడియాకు చెప్పారు. అదే విషయాన్ని బాధితులకు చెప్పి అక్కడికి నుంచి పంపించేశారు. అయితే ఈ సొమ్మును కాజేసిన మెసెంజర్ కు రాజకీయ నేతలతో సంబంధాలున్న కారణంగానే.. యథేచ్ఛగా ఇలా దోపిడీకి పాల్పడ్డారని, అందుకే అతడికి మద్దతుగా పోలీసులు నిలిచారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ బ్యాంకులో జరిగిన ఈ కిరికిరి వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. మరి ఈ వ్యవహారంలోని అసలు నిజాలు బయటకు వస్తాయో.. లేదంటే అలాగే మరుగున పడిపోతాయో చూడాలి.
Must Read ;- మహిళా కమిషన్ విచారణకూ అడ్డంకులే










