తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన ‘తలైవి’ చిత్రం ఎలా ఉంది? జయ పాత్రను కంగనా రనౌత్ ఎలా పోషించింది? ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ ముందడుగు వేసిన జయలలిత జీవితంలోని ఎలాంటి అంశాలను ఇందులో స్పృంశించారు? లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఈ సినిమాలో ఎలా చెప్పారన్న కుతూహలం ఎవరికైనా సహజం. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ రోజు ముందుగానే ఈ సినిమా ప్రివ్యూని మీడియా కోసం ప్రదర్శించారు. విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విష్ణువర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
కథలోకి వెళితే..
తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవంతో సినిమా ప్రారంభమవుతుంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న జయలలిత(కంగన) ను అసెంబ్లీ హాలులోనే కొట్టి, చీరె లాగి అవమానించిన సంఘటనతో జయ ఎంతగా రగిలిపోయింది? దీనికి ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంది? అనే అంశంతో ప్రారంభమైన సినిమా ఫాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతుంది. సినిమా నటి జయ తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న యువతి. ఆమెలో ఉన్న పొగరు, వగరు ఎలాంటివో సినిమా నటిగా ఉన్నప్పుడే చూపించారు. ఎంజీఆర్ లాంటి సూపర్ స్టార్ తో తాను నటించబోతున్నానని తెలిసి కూడా ఆయన ముందే అహంభావాన్ని ప్రదర్శిస్తుంది.
చివరికి ఆయన వ్యక్తిత్వం ఆకట్టుకుని దగ్గరవుతుంది. ఓ పక్క సినిమా రంగంలో వేషాలు వేస్తూనే పెరియార్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడుపుతున్న అన్నాదురై పార్టీలో మిత్రుడు కరుణ(నాజర్ )తో కలిసి రామచంద్ర (అరవింద్ స్వామి) రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటాడు. జయకు దగ్గరవడం వల్ల ఎంజీఆర్ తన లక్ష్యాన్ని మరచిపోతున్నాడని ఎంజీఆర్ రైట్ హ్యాండ్ ఆర్.ఎం. వీరప్పన్ (సముద్ర ఖని) జయను ఎంజీఆర్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. దాంతో జయ శివాజీ గణేశన్ ను పొగుడుతూ ఆయనతో సినిమాలు చేస్తుంది. ఈ పాత్ర బహుశా శోభన్ బాబుకు సంబంధించింది కావచ్చు.
తెలుగు ప్రజలు నొచ్చుకోకుండా శివాజీ గణేశన్ గా చూపినట్టు అర్థమవుతోంది. తనకు ఫ్లాపులు రావడంతో ఎంజీఆర్ మళ్లీ జయను దగ్గరకు తీస్తాడు. అన్నాదురై చనిపోవడం, కరుణతో ఎంజీఆర్ కు విభేదాలు రావడం, పార్టీ రెండుగా చీలిపోవడం లాంటి పరిణామాలు జరుగుతాయి. ఆ తర్వాత ఎంజీఆర్ నటనకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల వైపు మొగ్గుచూపుతాడు. అనంతరం పార్టీ ప్రచార కార్యదర్శి బాధ్యతలను జయకు అప్పగిస్తాడు. ఎంజీఆర్ అనారోగ్యంతో మరణించడంతో పార్టీ పగ్గాలు జయ చేతికి వెళతాయి. కరుణకు గుణపాఠం చెప్పడం, పార్టీ అంతర్గత శక్తులను ధీటుగా ఎదుర్కోవడం లాంటి అంశాలతో సినిమా సాగుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
వివాదాస్పద అంశాలు లేకుండా ఏ బయోపిక్ తీసినా ప్రయోజనం ఉండదు. జయ జీవితం అంటేనే వివాదాల మయం. కానీ ఇందులో ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సినిమాని ముగించడమే పెద్ద మైనస్ పాయింట్. ఈ కథలో విలన్లు అంటూ ఎవరూ ఉండరు. పరిస్థితులు మాత్రమే వారిని అలా మార్చాయన్నట్టు చూపించారు. జయ వ్యక్తిత్వాన్ని మాత్రం చక్కగా చూపించారు. కథనంలో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు. వాటితో పాటు అనేక మరకలు కూడా ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలు ప్రేక్షకులకు అనవసరం. దీనివల్ల సినిమా సాగతీతలా అనిపిస్తుంది. నిడివి కూడా బాగా పెరిగింది. ఎవ్వరినీ నొప్పించకుండా సినిమా తీయాలని ముందే నిర్ణయించుకున్నట్టు అనిపించింది. తన శత్రువులను జయ ఎలా ఎదుర్కొంది అని మాత్రమే సినిమాలో చూపారు. ఒక ప్రభావవంతమైన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అన్నదే చూపాలని అనుకున్నారు. ఇక పాత్రల విషయానికి వస్తే జయగా కంగనా రనౌత్ ఆ పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఆమె పురుచ్చి తలైవిగా ఎలా మారిందో ఈ పాత్రను చూస్తేనే అర్థమవుతుంది. జయ జీవితాన్ని పైపైన చూసిన వారు సినిమా చూస్తే ఓహో జయ వ్యక్తిత్వం ఇలాంటిదా అనిపించకమానదు.
అలాగే ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు అనడం కన్నా జీవించారు అనే చెప్పాలి. ఎంతో బ్యాలెన్స్ తో ఆయన ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఎంజీఆర్ కుడిభుజం వీరప్పన్ గా సముద్ర ఖని మెప్పించారు. కరుణ పాత్రలో నాజర్, జయ తల్లి సంధ్యగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తమ పాత్రలకు న్యాయం చేశారు. రీరికార్డింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. జయ మరణం వరకూ కథను పొడిగించి సినిమాని ముగించి ఉంటే బాగుండేది. కొన్ని అనవసర సన్నివేశాలు తొలగించి ఉంటే నిడివి కూడా తగ్గేది.
ఇలాంటి కథకు ముగింపు మాత్రం చాలా పేలవంగా ఉంది. జయ మరణం వరకూ సినిమాని పొడిగించి ఉంటే వివాదాలకు తెరతీయక తప్పదని భావించి వాటిని వదిలేసినట్టు అర్థం చేసుకోవాలి. తెలుగులో ఏమోగాని తమిళ నాట మాత్రం ఈ తలైవి ప్రేక్షక జన ఆదరణను చూరగొనే అవకాశం ఉంది. సినిమా నిడివి కాస్త తగ్గించి విడుదల చేయడం ఉత్తమం అన్న భావన కలుగుతోంది.
నటీనటులు: కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, సముద్రఖని, రెజీనా కసాండ్ర, మధుబాల, ఫ్లోరా జాకోబ్, తంబిరామయ్య, షామ్నా కాశిం, రాజ్ అర్జున్ తదితరులు.
సాంకేతికవర్గం: కథ విజయేంద్ర ప్రసాద్, మదన్ ఖర్కే, రజత్ అరోరా, సంగీతం జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా విశాల్ విఠల్.
నిర్మాతలు: విష్ణువర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్
దర్శకత్వం: ఎ.ఎల్. విజయ్
విడుదల తేదీ: 10-09-2021
ఒక్క మాటలో: నాట్ ఎపిక్.. ఓన్లీ బయోపిక్
రేటింగ్: 2.75/5











