ఏపీ రాష్ట్రానికి నెల గడవడమే దినదిన గండంలా తయారైంది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని, రాష్ట్రానికి ఆదాయ వనరులు సృష్టించలేక, అనవసర వృధా ఖర్చులతో రాష్ట్రం అప్పుల పాలు అవుతోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల వేతనాలకు కూడా అప్పుల బాట పడుతున్న వైనంతో ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టంగానే కనబడుతోంది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిన ప్రభుత్వం.. కొత్త అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతోంది. ఇందులో భాగంగా విశాఖలోని పలు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది. భవిష్యత్తులోనూ మరిన్ని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
తలకు మించి అప్పులు.. ఆస్తులు తాకట్టు
ఇప్పటికే ముజ్యమంత్రి జగన్ రాష్ట్ర సంక్షేమ పథకాలకోసమంటూ, ఉద్యోగుల జీత భత్యాల కోసం తలకు మించి అప్పులు చేశారని, పరిమితులకు మించి అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. చంద్రబాబు ఐదు ఏళ్లలో చేసిన రెండు లక్షల కోట్లు అప్పులు జగన్ రెండేళ్లలో చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, చివరకు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి లోకి రాష్ట్రాన్ని నెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా రాష్ట్ర పరిపాలన అవసరాల కోసం జగన్ ఒక వైపు కేంద్ర సంస్థల దగ్గర పరిమితికి మించి అప్పులు తెస్తూ.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి డబ్బు సమకూర్చుకోవాలన్నది జగన్ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అందులో భాగంగా విశాఖపట్నం లోని ప్రభుత్వ ఆస్తులు అయిన ప్రభుత్వ ఐఐటి కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, సర్క్యూట్ హౌస్, రైతు బజార్, పోలీసు క్వాటర్స్ ఇలా 13 రకాల సంస్థలను 25 వేల కోట్ల రూపాయలకు బ్యాంక్ కు తాకట్టుపెట్టారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ (టీడీపీ) కోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తోంది.
ఆందోళనలో విశాఖ ప్రజలు
ప్రభుత్వ ఆస్తులు అయినటువంటి ప్రజా సంపదను తాకట్టు పెట్టడంపై విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా తాకట్టు పెట్టడం ప్రభుత్వ అసమర్ధకు నిదర్శనమని, విశాఖ లోని ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు కలిసి కట్టుగా ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, నర్సీపట్నం ఇంచార్జ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. కాగా జగన్ ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అని చెప్పి ఇప్పుడు ఇలా విశాఖ లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని విశాఖ ప్రజలు జగన్ పట్ల నిరసన ధ్వనులు వినిపిస్తున్నారు.
Must Read ;- నవంబర్ 1 విడుదల..‘అమరావతిలో అలజడి’!