ఏపీ ప్రభుత్వానికి నెల గడవడమే దినదిన గండంలా తయారైయింది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని, రాష్ట్రానికి ఆదాయ వనరులు సృష్టించలేక, అనవసర వృధా ఖర్చులతో రాష్ట్రం అప్పుల పాలు అవుతోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మాట నిజమేనన్నట్లుగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసింది. అంతేకాకుండా ఆ అప్పులన్నింటినీ సంక్షేమ పథకాలకే తరలిస్తూ ప్రజలకు పప్పూబెల్లాల్లా పంచి పెడుతోంది. ఉద్యోగ వేతనాలు, పెన్షన్లకు కూడా నిధులు అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల కోసం అప్పుల బాట పడుతున్న జగన్ సర్కారు.. ఇప్పుడు అప్పుల కోసం కొత్త మార్గాలను ఎంచుకుంటోంది. ఈ కొత్త మార్గంలో భాగంగా విశాఖలోని విలువైన రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతోంది.
తలకు మించి అప్పులు, ఆస్తులు తాకట్టు
ఇప్పటికే ముజ్యమంత్రి జగన్ రాష్ట్ర సంక్షేమ పథకాలకోసమంటూ, ఉద్యోగుల జీత భత్యాల కోసం తలకు మించి అప్పులు చేశారని, పరిమితులకు మించి అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. జగన్ రెండేళ్లలోనే అంతకుమించి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారని చేశారని, చివరకు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా రాష్ట్ర పరిపాలన అవసరాల కోసం ఒక వైపు కేంద్ర సంస్థల దగ్గర పరిమితికి మించి అప్పులు తెస్తూ.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి డబ్బు సమకూర్చుకోవాలని జగన్ ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగా విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్తులు అయిన ప్రభుత్వ ఐఐటి కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, సర్క్యూట్ హౌస్, రైతు బజార్, పోలీసు క్వాటర్స్ ఇలా 13 రకాల సంస్థలను రూ.25 వేల కోట్లకు బ్యాంకులకు తాకట్టుపెట్టారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ (టీడీపీ) కోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తోంది.
ఆందోళనలో విశాఖ ప్రజలు
ప్రభుత్వ ఆస్తులు అయినటువంటి ప్రజా సంపదను తాకట్టు పెట్టడంపై విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా తాకట్టు పెట్టడం ప్రభుత్వ అసమర్ధకు నిదర్శనమని, విశాఖ లోని ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు కలిసి కట్టుగా ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, నర్సీపట్నం ఇంచార్జ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. కాగా జగన్ ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని చెప్పి ఇప్పుడు ఇలా విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని విశాఖ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Must Read ;- మోదీనే కుదువ పెట్టబోయారే!











