సూపర్ స్టార్ రజినీ ‘అన్నాత్తే’ విడుదల ఎప్పుడు? అజిత్ ‘వాలిమై’తో పోటీ పడబోతుందా? మరి సంక్రాంతి బరిపై ఎవరి గురి ఉంది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్నాయి. ముందుగా రజినీ సినిమా విషయానికే వద్దాం. శివ దర్శకత్వంలో ఈ అన్నాత్తే తెరకెక్కింది. ఈ దీపావళికి అన్నాత్తే విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అదే సమయానికి అజిత్ వాలిమై కూడా విడుదలవుతున్నట్లు వార్తలొచ్చాయి. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి బరిలోకి దిగడం వల్ల ఎవరో ఒకరు నష్టపోయే ప్రమాదమైతే ఉంది.
అందుకే అన్నాత్తే విడుదల వాయిదా పడినట్టు వార్తలొచ్చాయి. అందుకే ఇరువర్గాలూ భేటీ అయి ఒక ఒప్పందానికి వచ్చారట. ఆ ప్రకారం అనుకున్న సమయానికి అంటే ఈ దీపావళికి నవంబరు 4న రజినీ అన్నాత్తే విడుదలవుతోంది. ఇక అజిత్ వాలిమై మాత్రం వచ్చే సంక్రాంతి బరికి సిద్ధమవుతోంది. ఇక్కడ కూడా సమస్య వచ్చిపడింది. అదే సమయానికి తెలుగులో పాన్ ఇండియా సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇన్ని చిత్రాలను సర్దుబాటు చేయడం ఎంతవరకు సమంజసం అనే వాదన వినిపిస్తోంది.
దాంతో వాలిమైకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒక్క వాలిమై మాత్రమే కాదు చాలా తెలుగు చిత్రాలు సంక్రాంతిపైనే గురిపెట్టాయి. తప్పని పరిస్థితుల్లో తమ చిత్రాల విడుదల తేదీలను మార్చుకోక తప్పడం లేదు. మరో వదంతి ఏమిటంటే విక్రమ్ హీరోగా నటించిన ‘మహన్’ ను కూడా ఈ దీపావళికే విడుదల చేయాలనుకుంటున్నారు. వీటితో పాటు సిలంబరస్ ‘మాయనాడు’ కూడా దీపావళి బరిలో ఉంది. ఇవికాకుండా మరికొన్ని తమిళ చిత్రాలు సూర్య ‘ఈతర్కం తునింతవన్, ప్రభుదేవా ‘భాగీర’ కూడా షూటింగులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమై ఉన్నాయి.
పైగా ఇవి ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువాదమై విడుదలకానున్నాయి. ఇలాంటి తరుణంలో దీపావళికి మరికొన్ని తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ముఖ్యంగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ చిత్రం కూడా దీపావళి బరిలో ఉంది. మరికొన్ని పెద్ద సినిమాల టార్గెట్ కూడా దీపావళి పైనే ఉంది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది. ఒక్కటి మాత్రం స్పష్టం రజినీ అన్నాత్తే మాత్రం ఈ దీపావళికి విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Must Read ;- ‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి