ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై, అధికార వైసీపీపై ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారం ముగియనున్న కాసేపటి ముందు..ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఆర్థికంగా, శాంతిభద్రతల పరంగా చూస్తే ఒక్కక్షణం కూడా వైఎస్ జగన్ కి అధికారంలో కొనసాగే అర్హత తేదన్నారు. మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..
జగన్‌కి కళ్లు నెత్తికెక్కాయి..
‘అధికారం చేతికి వచ్చేటప్పటికి జగన్‌కి కళ్లు నెత్తికెక్కాయి. మదమా, కొవ్వా అర్థం కావడం లేదు. నిద్రపోతున్నారా..నిద్ర నటిస్తున్నారో తెలియడం లేదు. ఇదేం పాలన. అసలు వీళ్లు మనుషులేనా. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు.ఉద్యోగులకు టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇప్పటివరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అతీగతీ లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా ఇవ్వలేదు. హాస్టళ్లకు నిధులు కేటాయించడం లేదు. ఉమ్మడి ఏపీలో, ప్రస్తుత ఏపీలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే దోషులను పట్టుకోలేదు. ఆ విషయం ప్రశ్నిస్తేనాపై కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లను వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కుంభకోణానికి తెరలేపారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ప్రజల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. శాంతిభద్రతల పరిస్థితితోపాటు కుటుంబాలు కూడా ఆందోళనతో ఉన్నాయి. నంద్యాలలో సలావుద్దీన్ కుటుంబం వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండడంతో మనోస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏ ఒక్క విషయంలోనూ వైఎస్ జగన్ సర్కారు పట్టించుకున్నట్లు లేదు. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని తాకట్టు పెట్టారు. వీరికి మరో ఎంపీని ఇచ్చినా అదే పరిస్థితి. ఇక వైసీపీ నాయకుల మాటలు చూస్తే..ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. మహిళలనే కనీస గౌరవం లేకుండా రౌఢీల్లా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇష్టానికి మాట్లాడుతున్నారు. వైసీపీ నుంచి తిరుపతిని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని రక్షించుకోవాలి.
సొంత బాబాయి హత్య కేసులోనూ..
గతంలో టీడీపీ హయాంలో పరిశ్రమలు ఏపీ వైపు చూసేవి. సన్ రైజ్ ఏపీని అమలు చేశాం. కాని ఇప్పుడు ఉన్న కంపెనీలు పోతున్నాయి. ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. జేసీబీలతో పాలన చేస్తున్నారు. శుక్రవారం జేసీబీలను ఇంటికి పంపించి కూల్చివేయిస్తున్నారు. ఎస్సీలపైన ఎస్సీకేసు పెట్టిన సర్కారు ఇది. ఎస్సీలపైనా ఈ ప్రభుత్వం దాష్టీకాలకు పాల్పడుతోంది. ఎస్సీలపై 150కిపైగా దాడులు జరిగాయని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారు. సొంత బాబాయి హత్య కేసు విషయంలోనే జగన్ మడమ తిప్పాడు. ఏ విషయంలోనూ స్పందించడం లేదు. ఇరవైనాలుగు గంటలూ సీఎం ఇంటివద్ద 144సెక్షన్ పెట్టించుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు.
కట్టప్ప రహస్యం తేలినా..
వివేకా హత్య కేసు విషయంలో జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తేలినా.. బాబాయిని చంపింది ఎవరో తేలలేదు. సీబీఐకి కూడా సహరించకుండా రాజకీయం చేస్తున్నారు. సీబీఐ కూడా ఈ కేసును చేధించాల్సి ఉంది. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి. నేరస్తులెవరో తేల్చాలి. ఈ హత్య కేసులోనూ సాక్షులు చనిపోతున్నారు. పరిటాల రవి కేసులోనూ సాక్ష్యుల్ని ఇలాగే చంపేశారు. దుర్మార్గ పాలనకు వైసీపీ సర్కారే సాక్ష్యం.
22మంది ఉన్నా..
వైసీపీకి 22మంది లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేకహోదా గురించి కనీసం మాట్లాడడం లేదు. ఇన్నాళ్లు ఏం సాధించారో చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అన్నింటిలోనూ రాజకీయాలు చేస్తున్నారు. దోపిడీనే అజెండాగా పాలన సాగిస్తున్నారు. గోరంత సంక్షేమానికి ఇచ్చి కొండంత దోచుకుంటున్నారు. విదేశాల్లో దాచుకుంటున్నారు. తిరుపతి పవిత్రతను దెబ్బతేసేలా వ్యవహరిస్తున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్నారు. తిరుపతిలో భూములూ కబ్జా చేస్తున్నారు.
పింక్ డైమండ్ ఏమైంది..తేల్చారా..
గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ తీవ్రమైన ఆరోపణ చేసింది. పింక్ డైమండ్ నా ఇంట్లో ఉందని తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారుగా..ఆ పింక్ డైమండ్ ని ఎందుకు బయటపెట్టడం లేదు. పింక్ డైమండ్ పై అవాస్తవ ఆరోపణలు చేసిన వ్యక్తిని ప్రధాన అర్చకుడిగా నియమించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారు. బస్సు టిక్కెట్లపై అన్యమతానికి సంబంధించిన ప్రచారం చేశారు. ఎస్వీబీసీ ఛైర్మన్ ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించిన విషయం వాస్తవం కాదా. శ్రీవారి భక్తులకు అశ్లీల వెబ్‌సైట్ల లింకులు పంపిన చరిత్ర కూడా ఉంది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.
గురుమూర్తి ఎస్సీనా..బీసీనా..
నవరత్నాలని ఆర్భాటంగా ప్రచారం చేసిన వైసీపీ..అధికారంలోకి వచ్చాక వాటి అమలులో విఫలమైంది. ఆ మాటున దోపిడీకి పాల్పడుతోంది. అవి నవరత్నాలు కాదు..నవ మోసాలు..మహిళలకు రూ.14వేలు ఇచ్చి..మద్యం రేట్లు పెంచి పురుషుల దగ్గర అంతకంటే ఎక్కువే దోపిడీ చేస్తున్నారు. సెంటు భూమి ఇచ్చామని చెబుతూ రూ.6500కోట్ల అవినీతి చేశారు. 2.5 లక్షల మంది వలంటీర్లను నియమించామని చెప్పి..6లక్షల మందికి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. రైతుభరోసా కింద టీడీపీ రూ.12500 ఇస్తే వైసీపీ ప్రభుత్వం రూ.7500 ఇస్తుందని, అది కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థి ఉంది. ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి మతం మారాడన్న ఆరోపణ ఉంది. మతం మారితే బీసీ-సీ కిందకు వస్తారు. ఎస్సీ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని ఎలా నిలబెడతారు.
ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి..
వైసీపీ తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో అన్ని అక్రమాలకూ పాల్పడుతోంది. ఓటుకు రూ.5వేలు పంచేందుకు సిద్దమైంది. దొంగఓట్లకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ఏవేని రెండు గుర్తింపు కార్డులు చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. స్థానికంగా కొందరు అధికారులు ప్రభుత్వానికి సరెండర్ అయినట్లు సమాచారం ఉంది. నాపై రాళ్లు వేస్తేనే…డీఐజీ రాళ్లే పడలేదని చెప్పే అరాచక పరిస్థితి వచ్చింది. అందుకే మైక్రో అబ్జర్వర్లను నియమిచాంల్సిందిగా ఈసీని కోరుతున్నాం.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Must Read ;- వైసీపీకి ఓటెందుకు వెయ్యొద్దో బాబు, లోకేశ్ చెప్పేశారు