( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి భూములపైన పడింది. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములను సొంతం చేసుకునేందుకు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బాధితులను బెదిరించడం షరా మామూలే అయినా, కోర్టు కేసులు ఉన్న వ్యవహారాల్లో లాయర్‌లను సైతం బెదిరించే స్థాయికి విశాఖలో పరిస్థితులు దిగజారాయి. గతంలో ఓ భూ వ్యవహారంలో కడప నుంచి వచ్చిన రౌడీ షీటర్లు, నాయకులు భూ యజమానులను బెదిరించిన సంఘటనలు వెలుగు చూశాయి.
ఫోన్ చేసి బెదిరింపు
తాజాగా గాజువాకలో మహిళా న్యాయవాదిని కొండా రెడ్డి అనే వ్యక్తి బెదిరించాడని మహిళా న్యాయవాది శ్రీనివాసమ్మ ఆరోపించారు. ఆమెతో కలిసి బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం అగనంపూడికి చెందిన సర్వే నెంబర్ 31/15 లో గల నాలుగు సెంట్ల భూమి గల్లా చినతల్లికి చెందినది. ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. చినతల్లి రెండు సార్లు పోల్స్ వేస్తుండగా అడ్డుకుని వాటిని పీకి పారేశారు. ఇక చేసేది లేక లాయర్ శ్రీనివాసమ్మను కలువగా ఆమె కోర్టులో కేసు వేశారు. వర్మ, బలరాం అనే వ్యక్తులు లాయర్, చినతల్లిని కలిసి ఆ భూమి తమదని తెలిపారు. దీనిపై మాట్లాడదామని చెప్పారు. ఇంతలో పులివెందుల నుండి కొండా రెడ్డి అనే వ్యక్తి లాయర్ శ్రీనివాసమ్మకు ఫోన్ చేసి బెదిరించాడని అమె తెలిపారు. వైస్ జగన్, విజయసాయి రెడ్డి బంధువునని, తాను తలచుకుంటే కేసులు పెడతానని బెదిరించినట్లు లాయర్ ఆరోపించారు. ఈ విషయమై సీఎంకు, సీపీకి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. విచారణ జరిపి బెదిరిస్తున్న వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఇప్పటికే వివరాలు సేకరిస్తోంది.
Also Read: జగన్ స్వస్థలంలో వైసీపీ ముఠా కొట్లాటలు











