అలా.. మొదలైంది సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే విజయం సాధించి.. అందరి దృష్టిని ఆకర్షించింది నందినీ రెడ్డి. ఆతర్వాత సిద్ధార్థ్ తో జబర్థస్త్ సినిమాని తెరకెక్కించింది. టైటిల్ జబర్థస్త్ గా ఉన్నప్పటికీ.. సినిమా మాత్రం జబర్థస్త్ గా లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆతర్వాత యువ హీరో నాగశౌర్యతో తీసిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఫరవాలేదు అనిపించింది. ఆ తర్వాత సమంతతో నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమా ఓ.. బేబి. కొరియన్ మూవీ రీమేక్ అయినా అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది.
ఇందులో సమంత నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పచ్చు. డబ్బై ఏళ్ల బామ్మగా సమంత అదరగొట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్ సీస్ లో సైతం ఓ బేబి సంచలనం సృష్టించింది. దీంతో నందినీ రెడ్డి తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది అనుకుంటే… మళ్లీ సమంతతోనే సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. చాలా కాలం వార్తల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఆతర్వాత నందినీ రెడ్డి సమంతతో కాదు.. నాగచైతన్యతో సినిమా చేయనుంది అని ఓ వార్త బయటకు వచ్చింది.
ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్నదత్ నిర్మించనున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపించింది. నాగచైతన్యతో కథాచర్చలు జరగడంతో ఈ సినిమా పక్కా అనుకున్నారు. త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది అనుకున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇలా నందినీ రెడ్డి సమంతతో ఓ సినిమా, నాగచైతన్యతో ఓ సినిమా చేయాలనుకుంటే… ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకుండా కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి.
ఇదిలా ఉంటే… నందినీ రెడ్డి తదుపరి చిత్రం గురించి ఓ అప్ డేట్ వచ్చింది. అది ఏంటంటే… నందినీ రెడ్డి సందీప్ కిషన్ తో సినిమా చేస్తుందట. ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించనున్నారని తెలిసింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో కథానాయికకు ప్రాధాన్యత ఉంటుందట. అందుచేత స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారని.. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది ఖరారు చేస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని జనవరిలో కానీ.. ఫిబ్రవరిలో కానీ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
Must Read ;- టాలీవుడ్ స్టార్ బ్రదర్స్ సంక్రాంతికి రావడం లేదా..?











