ఆయన గన్ పడితే జేమ్స్ బాండ్.. గుర్రమెక్కితే కౌబాయ్.. విల్లు ఎక్కుపెడితే అల్లూరి సీతారామరాజు.. పంచె కడితే పక్కా పల్లెటూరి మొనగాడు. దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం పాటు తెలుగు చిత్రసీమను ఏలిన మకుటంలేని మహారాజు. సాహసం ఆయన ఊపిరి.. ధైర్యం ఆయన చిరునామా. ప్రయోగాలు ఆయన హాబీ. ఆయన పేరు ఘట్టమనేని కృష్ణ.
340కి పైగానే చిత్రాల్లో నటించి.. 14 చిత్రాలకు దర్శకత్వం వహించి, 50 చిత్రాలకు పైగానే నిర్మించిన కథానాయకుడు ఆయన. నేడు ఆ సూపర్ స్టార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాలు.. నెలకొల్పిన రికార్డులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
1965 లో వచ్చిన ఆదుర్తిసుబ్బారావు ‘తేనెమనసులు’ సినిమాతో కృష్ణ తెలుగు చిత్ర సీమలోకి హీరోగా అడుగుపెట్టారు. ఆ ఏడాదే ‘కన్నెమనసులు’ సినిమాలో కూడా నటించారు. 1966 లో ‘గూఢచారి 116’ . ఇలా రెండేళ్ళలో మూడు సినిమాలకు మాత్రమే పరిమితమైన కృష్ణ ఈ మూడు విజయాలతో టాలీవుడ్ లో న్యూ సెన్సేషన్ గా అవతరించారు. ఇక 1967 లో అయితే ఏకంగా ఏడు సినిమాల్లో నటించి.. సత్తా చాటగా.. ఆ తర్వాత మూడేళ్ళలోనూ మొత్తం 15 సినిమాల్లో నటించి కొత్త చరిత్ర సృష్టించారు.
అప్పట్లో యన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కృష్ణ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని.. యాక్షన్ , జేమ్స్ బాండ్ , క్రైమ్ చిత్రాలకు సరికొత్త నిర్వచనంగా నిలిచారు. పద్మాలయా స్టూడియోస్ నిర్మించి… తెలుగు ఇండస్ట్రీలో తొలిసారిగా 70 యం.యం, సినిమాస్కోప్, డిటీయస్ లాంటి ఎన్నో సాంకేతిక ప్రక్రియల్ని పరిచయం చేశారు. సాంఘిక , పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలతో పాటు జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి అన్నిజానర్స్ ను టచ్ చేసి అద్భుత విజయాలు సాధించారు.
ఇక కృష్ణ 25 సార్లు ద్విపాత్రాభినయం, ఏడు సార్లు త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా.. విజయనిర్మలతో 48 సినిమాలు, జయప్రద తో 47 సినిమాలు, శ్రీదేవితో 33 సినిమాలు చేయడమే కాకుండా.. స్నేహానికి ప్రాణం పెట్టే ఆయన నిర్మాతలు అడిగిందే తడవుగా.. ఏమీ ఆలోచించకుండా.. మొత్తం 25కు పైగానే గెస్ట్ రోల్స్ లో నటించి అందులో కూడా రికార్డు క్రియేట్ చేశారు. పగలు, రేయి తేడా లేకుండా రోజుకు మూడు షిప్ట్ లు పనిచేసి.. నమ్ముకున్న నిర్మాతలకు లాభాల పంట పడించిన సూపర్ స్టార్ ఆయన. ఆ రికార్డుల రారాజు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది లియో న్యూస్ .
Must Read ;- అభిమానులకు బాలయ్య ‘అఖండ’మైన పుట్టినరోజు కానుక