రాజకీయాల్లోఆయన రూటే సెపరేటు. దేన్నిఅయినా సరే బిజినెస్ యాంగిల్లో చూడటం అలవాటు. అది కాంట్రాక్టు వర్కులైనా..రాజకీయమైనా సరే. ఏదైనా పెట్టుబడి పెట్టందే లాభం రాదు..అది రాజకీయంలో కూడా అంతే అనేది ఆయన కాన్సెప్ట్. అందుకే పదవి చిన్నదైనా..పెద్దదైనా..భారీగా ఖర్చు పెట్టడం ఆయనకు అలవాటు. అలా ఒకసారి ఎంపీగా గెలిచి షాకిచ్చాడు. తర్వాత ఎమ్మెల్సీగా గెలిచి ఆశ్చర్యపర్చాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన నమ్ముకున్న కాన్సెప్టుతోనే ఇవన్నీ సాధించాడని చెప్పుకుంటూ ఉంటారు.
ఉన్నది కాంగ్రెస్‌లో… చూస్తోంది బిజెపి వైపు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్‌లో… కాని చూస్తోంది బిజెపి వైపు. కారుకు ఉండేది కాంగ్రెస్ జెండా..కాని మాట్లాడేది బిజెపి అజెండా. కాంగ్రెస్‌లో ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. అందులో ఉన్న అడ్వాంటేజ్ అదే. ఈయన రాహుల్, సోనియాను కూడా విమర్శించేస్తున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డిని అయితే సరే సరి.. దాదాపు ఉతికి ఆరేయటమే. ఒక టైములో గాంధీభవన్‌లోనే బాస్ రివాల్వర్ తీసి భయపెట్టాడు. అంత దూకుడు. తన ప్రయోజనాల కోసం సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా లెక్క చేయడని ఆయన సన్నిహితులే చెబుతుంటారు. ఇప్పుడు ఎవరికీ అర్ధం కానిది ఏంటంటే.. బిజెపిలోకి వెళ్లాల్సినవాడు..వెళ్లకుండా దేని కోసం కాంగ్రెస్‌లో వెయిట్ చేస్తున్నట్లు?
Also Read ;- రాజగోపాల్ రెడ్డి తో డీకే అరుణ భేటీ : 4 గంటల పాటు చర్చలు, బీజేపీలో చేరేందుకు సానుకూల స్పందన!

పీసీసీ చీఫ్ పదవి చేపట్టాలని..
అసలు ముందు పీసీసీ చీఫ్ పదవి తనే చేపట్టాలని మ్యాగ్జిమమ్ ట్రై చేశాడు. దాని కోసం ఎన్ని సూట్‌కేసులైనా ఢిల్లీలో ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అయినా పని కాలేదు. ఈలోపు రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఈక్వేషన్లు మారిపోయాయి. అయినా ఆశలు వదిలేయలేదు. ఇప్పుడు కూడా పొరపొటున అన్న వెంకటరెడ్డికి అయినా వస్తుందేమో.. అప్పుడైనా చక్రం తిప్పొచ్చని కోరిక. అందు కోసమే ఇప్పుడు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్‌రెడ్డి పేరు ప్రకటిస్తే.. వెంటనే బిజెపిలోకి చేరిపోవటానికి రంగం సిద్ధమైపోతుంది.
కుంభస్ధలంపైనే గురి
బిజెపిలో ఇప్పుడైనా చేరొచ్చు కదా..బాగానే ఉంటుంది కదా అని కొందరు అనుకోవచ్చు. ఏదైనా కుంభస్ధలంపైనే రెడ్డిగారి గురి. బిజెపిలో చేరినా అగ్రతాంబూలం తనకే దక్కాలనేది కోరిక. కాని అక్కడ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ లాంటి హేమాహేమీలున్నారు. లేటెస్ట్ ఫైర్ బ్రాండ్స్ బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎటూ ఉన్నారు. సో బిజెపిలో చేరితే..తాను కూడా వారిలో ఒకడిని అయిపోతాను గాని.. తను తెలంగాణ ముఖ్యమంత్రిగా అవ్వాలనే కల నెరవేరదు కదా అనేదే మీమాంస అని టాక్ వినపడుతోంది. అందుకే కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలపై ఇంకా వేచిచూసే ధోరణిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
ఎటూ రేపో మాపో రేవంత్‌రెడ్డి పేరే ప్రకటన వచ్చే అవకాశాలే ఎక్కువ. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎటూ అవకాశం ఉండదనుకుంటే..అప్పుడైనా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపిలో చేరక తప్పదు. ఈలోపు అక్కడ ఈటల రాజేందర్ లాంటి నాయకుడు…కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి బిగ్ షాట్స్ చేరతారు. అప్పుడు రాజగోపాల్‌రెడ్డికి మరింత ప్రయారిటీ తగ్గుతంది. మరి ఎలాంటి వ్యూహంతో ఎప్పటికి ముందుకు అడుగు వేస్తారో రాజగోపాల్‌రెడ్డి చూడాలి మరి.
Must Read ;- కొంపముంచుతున్న కాలయాపన.. ఓవర్లు అయిపోతున్నా బ్యాటింగ్ చేయని టీకాంగ్రెస్











