TRS Complains To Sonia Gandhi And Rahul Gandhi Against Revanth Reddy :
టీపీసీసీ చీఫ్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే రేవంత్ రెడ్డి బుల్లెట్ స్పీడుతో సాగుతున్నారు. నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ సంధిస్తున్న మాటలు నిజంగానే తూటాల్లా పేలుతున్నాయి. టీఆర్ఎస్ ను తీవ్రంగానే కలవరపెడుతున్నాయి. మానసికంగా గాయపరుస్తున్నాయి కూడా. ఈ మాటలు అంటున్నది కాంగ్రెస్ పార్టీ నేతలో, బీజేపీ నేతలో కాదు.. స్వయంగా టీఆర్ఎస్ నేతలే ఈ మాటలు అంటున్నారు. ఈ మాటలు బయటకు అనే వరకు అయితే ఓకే గానీ.. అమ్మా మీ వాడి దాడితో చిత్తు చిత్తు అయిపోతున్నాం. మమ్మల్ని మీరే రక్షించాలి.. అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆశ్రయించారంటే.. పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు కదా. నిజమా? రేవంత్ దెబ్బకు తట్టుకోలేక టీఆర్ఎస్ నేతలు సోనియా గాంధీని శరణువేడారా? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది.
రేవంత్ స్పీడు డబులైంది
అయినా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్. విపక్షం కాంగ్రెస్. మరి విపక్షంలోని రేవంత్ రెడ్డిని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నిలువరించలేక పోతోందంటే.. రేవంత్ ఏ స్పీడుతో వెళుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. టీడీపీలో ఉండగానే.. బిడ్డా నీ అంతు చూసే దాకా వదిలిపెట్టేది లేదని నేరుగా కేసీఆర్ కే వార్నింగ్ ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరి.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. రేవంత్ మరింత స్పీడు పెంచుతారు కదా. అదే జరిగింది. టీపీసీసీ చీఫ్ పదవి దక్కగానే.. కేసీఆర్, ఆయన ఫ్యామిలీ టార్గెట్ గా రేవంత్ తనదైన శైలి దూకుడుతో సాగుతున్నారు. ఈ దూకుడుతో టీఆర్ఎస్ నేతలు చిత్తు చిత్తు అవుతున్నారని చెప్పాలి. అసలు రేవంత్ రెడ్డి సంధించే తూటాల్లాంటి మాటలకు టీఆర్ఎస్ కీలక నేతల నుంచి అసలు స్పందనే ఉండటం లేదు. అయితే ఒకింత దురుసుగా వ్యవహరించే నేతలను టీఆర్ఎస్ అధిష్ఠానం రేవంత్ పైకి ఉసిగొల్పుతోంది. అయినా కూడా రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు.
జీవన్ రెడ్డే చెప్పారు..
సరే.. విపక్షమన్నాక.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీని బోల్తా కొట్టించి అధికారం దక్కించుకోవాలని చూడటంలో తప్పు లేదు కదా. ఈ కోవలోనే సాగుతున్న రేవంత్ రెడ్డి కూడా దూకుడుగా సాగుతున్నారు. ఈ దూకుడు తట్టుకోవడం టీఆర్ఎస్ కు సాధ్యం కావడం లేదు. పోలీసు కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి పెద్దగా భయపడేది కూడా లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని గులాబీ నేతలు.. ఓ ఉపాయం ఆలోచించారట. ఆ ఉపాయం మేరకే రేవంత్ రెడ్డిపై ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట. ఇదేదో టీఆర్ఎస్ ను అభాసుపాలు చేసే ఉద్దేశం ఉన్న వారు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పిన మాట. సీఎం కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లామని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో సోనియా, రాహుల్ గాంధీలకు తాము లేఖలు కూడా రాశామని కూడా జీవన్ రెడ్డి చెప్పారు.
Must Read ;- రేవంత్ దెబ్బకు కేసీఆర్ బయటకొచ్చారా?