Y.S Jagan And Sharmila Tribute To Y.S Rajasekhara Reddy In Different Times :
వైఎస్సార్ ఫ్యామిలీ రెండు ముక్కలైపోయింది. కొడుకు ఏపీకి పరిమితమైతే.. కూతురు తెలంగాణకే ఫిక్సైపోయారు. అంతేనా.. కుటుంబానికి చెందిన ప్రధాన కార్యక్రమాల్లో కూడా కలుసుకోలేనంత దూరం ఆ కొడుకు, కూతురుల మధ్య పెరిగింది. తమను పెంచి పెద్ద చేసిన తండ్రికి నివాళి అర్పించేందుకు కూడా అన్నాచెల్లులు కలిసిరాలేనంత మేర ఎడం పెరిగిపోయింది. మరి ఈ దూరం, ఎడం.. శాశ్వతమా? లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం అన్నాచెల్లెలు కలిసి ఉమ్మడిగా రచించుకున్న వ్యూహమా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు చెల్లి ముందే వెళ్లి కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోతే.. ఆమె వెళ్లిపోయాక గాని అన్నగారు ఎంట్రీ ఇస్తారట.
జగన్ నుంచి షర్మిలకు ఆదరణ లేదు
వాస్తవానికి వైఎస్సార్ మరణించాక ఇప్పటిదాకా ఆయన వర్ధంతికి గానీ, జయంతికి గానీ కుటుంబం మొత్తం కలిసి ఇడుపులపాయ వెళుతోంది. కలిసే ప్రార్థనలు చేస్తోంది. ఉమ్మడిగానే వైఎస్సార్ కు నివాళి అర్పిస్తోంది. వైఎస్సార్ సతీమణి విజయమ్మ సమక్షంలో కొడుకు జగన్, కూతురు షర్మిల తండ్రికి ఒక్కుమ్మడిగానే నివాళి అర్పిస్తున్నారు. అయితే ఇకపై ఇదంతా గతం. ఇకపై వీరిద్దరూ కలిసి తండ్రికి నివాళి అర్పించే సన్నివేశాన్ని మనం చూడలేం. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీకి జగన్ పరిమితమైపోయి.. తెలంగాణలో పార్టీ శాఖను మూసేసుకున్నారు. అయితే తన వెంటే నడిచేందుకు సిద్ధపడ్డ చెల్లి షర్మిలను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. సరే.. వేచి చూద్దాం.. అన్న ఆదరించకపోతాడా అన్న చెల్లి ఆశ నిరాశగానే మిగిలిపోయింది. వెరసి మెట్టినింటి నుంచి రాజకీయం చేద్దామంటూ షర్మిల తెలంగాణలో కాలు పెట్టింది. ఈ పరిణామంతో వైఎస్సార్ ఫ్యామిలీలో వేరు కుంపట్లు మొదలైనట్లుగా వార్తలు వినిపించాయి.
వైఎస్సార్ అభిమానుల్లో ఆందోళన
అయితే జగన్, షర్మిలల మధ్య విభేదాలు కేవలం రాజకీయాల వరకే గానీ.. కుటుంబ విషయాల దాకా రావులే అని వైఎస్సార్ అభిమానులు అనుకున్నారు. అయితే వారి భావనను పటాపంచలు చేసిన అన్నాచెల్లెల్లు కుటుంబ కార్యక్రమాలను కూడా వేర్వేరుగానే చేసుకునేందుకు సిద్ధపడిపోయారు. రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఉదయమే ఇడుపులపాయకు వెళ్లనున్న షర్మిల తన తండ్రికి నివాళి అర్పించి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతారు. ఆ తర్వాత సాయంత్రం జగన్ ఇడుపులపాయ చేరుకుని తండ్రికి నివాళి అర్పిస్తారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో బుధవారం రెండు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. అయితే ఇదేదో ముందుగా అనుకున్నది కాదు. తండ్రి సమాధి వద్దకు ఉదయమే వెళ్లాని జగన్ అనుకున్నా.. అదే సమయానికి చెల్లి వస్తున్నదన్న సమాచారంతో తన షెడ్యూల్ నే మార్చేసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
విజయమ్మ పరిస్థితేంటో?
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలను రెండు కళ్లలా చూసుకునేవారు. తండ్రికి కూతురుపై మమకారం ఎక్కువైతే.. తల్లికి కొడుకుపై మమకారం ఎక్కువ. అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఎక్కడా తేడా రానీయలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌కు పిల్లలు విడిపోయిన విషయం ఎలాగూ తెలిసే ఛాన్స్ లేదు. ఇక బతికున్న తల్లి విజయమ్మ ఇప్పుడు తన కళ్ల ముందే పిల్లలు వేర్వేరు దారుల్లో నడుస్తున్న తీరు నిజంగానే బాధ కలిగించేదే. కొడుకు పక్షం వహించాలా? లేదంటే కూతురు వైపు నిలబడాలా? అన్న విషయాన్ని విజయమ్మ తేల్చుకోలేకపోతున్నారు. ఇక న్యూట్రల్ గా ఉందామనుకున్నా.. కనీసం తన భర్తకు నివాళి అర్పించేందుకు తన పిల్లలు ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వస్తున్న తీరు నిజంగానే విజయమ్మకు తీవ్ర శోకాన్ని తెప్పించేదే. మరి తొలుత కూతురుతో కలిసి భర్తకు నివాళి అర్పించి.. కొడుకుతోనూ కలిసి రెండో మారు నివాళి అర్పిస్తారా? లేదంటే.. వీరి గొడవలతో నేను పడలేను.. నేను సపరేట్ గా నివాళి అర్పించానుకుంటారో చూడాలి. మొత్తంగా అన్నాచెల్లెల్ల విభేదాలు విజయమ్మకు ఇబ్బందికరంగా మారాయని చెప్పక తప్పదు.
Must Read ;- జగన్ వదిలేసినా.. రేవంత్ వదలరంట