గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయానికి అభ్యర్థులు రక రకాల ఎత్తులు వేశారు. అధికార , విపక్షం అన్న తేడా లేకుండా అంతా ఇదే దారిలో నడిచారు. తమను గెలిపిస్తే మేయర్ అవుతామంటూ కొందరు మహిళలు ప్రచారంలోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందరి కంటే టీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలు సాధించడంతో ఆ పార్టీకి చెందిన నలుగురు మహిళలు మేయర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
సింధూ ఆదర్శ్‌రెడ్డి..
మేయర్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతున్న పేర్లలో మొదటి పేరు ఈమెదే. పటాన్‌చెరు నియోజకవర్గంలోని భారతీ నగర్ డివిజన్ నుంచి గెలుపొందిన ఈమె విద్యాధికురాలు , వివాద రహితురాలిగా పేరుంది. రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేక పోయినా మొదటి నుండి ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రెండోసారి కార్పోరేటర్‌గా గెలిచిన సింధూ రెడ్డి ఈ సారి పక్కాగా మేయర్ అంటున్నారు. హరీష్‌రావు దగ్గరుండి ఆమెను గెలిపించారు. అయితే కార్పోరేటర్‌గా గెలిచిన మరుక్షణం నుండి ప్రగతి భవన్ నుండి కాల్ వచ్చిందని.. ముఖ్యమంత్రిని కలవ బోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే హరీష్ గెలిపించిన ఆమెకు మేయర్ పీఠం ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి.
బొంతు శ్రీదేవి..
మాజీ మేయర్ భార్య .. చర్లపల్లి నుండి పోటీకి చివరి వరకు ప్రయత్నించి ఆఖరు నిమిషంలో ఖరారయ్యారు. యువజన విభాగం నేతగా ఉండి గత పాలక మండలిలో బోంతు రాంమోహన్ మేయర్ అయ్యారు. పదవిని అడ్డుపెట్టుకుని రాంమోహన్ ఆస్తులు కూడబెట్టుకున్నారని అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. ఇక ఆయన భార్యే బొంతు శ్రీదేవి… ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొన్ని ఎకరాలు ఈమె పేరు మీద ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే మేయర్ భార్యకు టికెట్ ఇవ్వక పోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చివరికి ఖరారు చేసినట్లు అనుకుంటున్నారు.
విజయలక్ష్మి..
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేకే కుమార్తె ఈమె. గతంలోనే మేయర్ అభ్యర్థిగా రేసులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కేకే చక్రం తిప్పి ఆమెను మేయర్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆమెను కాదని బొంతు రాం మోహన్‌కు మేయర్ స్థానం కట్టబెట్టింది అధిష్టానం. ఆ తరువాత అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ వివిదాలు ఆమెను మేయర్ పదవికి దూరం చేశాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. సిట్టింగులకు టికెట్ కోతలో ఈమె పేరు ప్రధానంగా వినిపించింది. అయితే మొదటి లిస్ట్‌లోనే ఆమె పేరు ఖరారు కావడంతో ఈ సారి మేయర్ స్థానం ఇస్తారని ఆశిస్తున్నారు. గతంలోనే మేయర్ సీటు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ఇస్తారా అన్నది చూడాలి
విజయారెడ్డి..
పీజేఆర్ కూతురు .. ఖైరతాబాద్ డివిజన్ నుండి కార్పోరేటర్‌గా గెలుపొందారు. గ్రేటర్ గత పాలక మండలిలో గుర్తింపు వస్తుందని భావించినా ఆ స్థానం ఆమెకు దక్కలేదు. ఆమెపైనా కొన్ని విమర్శలు , ఆరోపణలు ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక ఈ సారి కూడా ఆమె ఖైరతాబాద్ నుండి గెలుపొందారు. మేయర్ పదవి దక్కుతుందా లేదా అనేది సందిగ్ధమే.
వీరే కాకుండా మరి కొంతమంది మహిళా నేతలు సైతం మేయర్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు . గ్రేటర్ హైదరాబాద్ రెండవ మహిళా మేయర్‌గా ఎవరవుతారో చూడాలి.
Must Read ;- ఎవరి లెక్కలు వారివి.. పట్టం కట్టేదెవరికో











