సాధారణంగా.. ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిల మీద దుర్మార్గాలకు పాల్పడే అబ్బాయిల వ్యవహారాలు మనం బోలెడు చూస్తుంటాం. అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, పొడిచి చంపేయడాలు, దారుణంగా వ్యవహరించడాలూ ఇలాంటివి మన చుట్టూ సమాజంలో అనేకం. అయితే.. పావని తీరు మాత్రం ప్రత్యేకం. తనను ప్రేమించి.. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసింది.
ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే..
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన అమ్మాయి పావని. ఈమెకు తాడేపల్లిగూడెం మండలం పాతూరుకు చెందిన అంబటి కరుణతాతాజీ నాయుడుతో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పావని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఏడాదిగా అతణ్ని కోరుతోంది. అయినా తాతాజీ ఓకే చెప్పకుండా.. ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈలోగా.. తాతాజీ మరో అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు ఆమెకు అనుమానం వచ్చింది.
ఈ నేపథ్యంలో- తాతాజీ సోమవారం నాడు పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి అతణ్ని కలవడానికి పావని కూడా వెళ్లింది. రాత్రి పొద్దుపోయే దాకా వారిద్దరూ కలిసి ఆ ప్రాంతాల్లోనే తిరిగారు. తిరిగి ఆమెను మలకపల్లి వద్ద దించేందుకు తాతాజీ మోటారు సైకిలుపై వెళుతుండగా.. వెనుక కూర్చున్న పావని బ్యాగులోంచి కత్తి తీసి అతణ్ని వీపుపై బలంగా పొడిచింది. ఆ దెబ్బకు అతని కింద పడిపోయాడు. తాతాజీ మెడ, తల, వీపు మీద పావని విచక్షణా రహితంగా కత్తితో పొడిచింది. తాతాజీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. దారిలో వెళుతున్న వారు.. గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పావని ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.
Must Read ;- ఏంటీ విచిత్రం? పెళ్లి ఇలా కూడా చేసుకోవచ్చా?