కమలహాసన్ ను ఒక ప్రాంతానికి చెందిన నటుడిగా ఎవరూ భావించరు. ఇటు ఉత్తరాదిన .. అటు దక్షిణాదిన అంతా ఆయనను తమవాడేనని అనుకుంటారు. ఆయన సినిమాలను అదే అభిమానంతో ఆదరిస్తారు. అందువలన కమల్ తో భారీ సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా వెనుకాడరు. ఇక తనకి నచ్చిన కథను ఒక ప్రయోగంగా ఆయన భావిస్తే, తనే నిర్మాతగా మారడానికి కూడా ఆయన ఎంతమాత్రం ఆలోచన చేయరు. అలా ఆయన ఈ సారి మరో ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చేయనున్న ఆ ప్రయోగం పేరే ‘విక్రమ్’.
కమలహాసన్ ఒక సినిమా చేస్తున్నారని కోలీవుడ్లో ఎవరూ చెప్పుకోరు .. ఒక ప్రయోగం చేస్తున్నారనే చెప్పుకుంటారు. కథాకథనాలతో పాటు తన లుక్స్ ను కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తూ కొత్తదనం అంటే ఇది అని నిరూపించడం ఆయనకి కొత్తేమీ కాదు. ఒక వైపున ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే, మరో వైపున తన సినిమాను థియేటర్లకు పంపించేంతవరకూ ఆయన పోరాడిన సందర్భాలు ఉన్నాయి. తన ప్రయోగాలు ఆర్థికపరమైన నష్టాలు తెచ్చినప్పుడు కూడా ఆయన డీలాపడిపోయిన దాఖలాలు ఎక్కడా కనిపించవు.
అలా ఆయన ఈసారి కూడా ‘విక్రమ్’ సినిమాతో నిర్మాతగాను రంగంలోకి దిగారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయట. వాటి కోసం ఆయన భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ‘మాస్టర్’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. నయనతార .. త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్. మరి ఈ ఇద్దరినీ తీసుకుంటారా? లేదంటే ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకుంటారా? చివరాఖరికి బాలీవుడ్ భామలను రంగంలోకి దింపుతారా? అనేది చూడాలి.
Also Read ;- రజినీ, కమల్.. మల్టీస్టారర్ రాజకీయమేనా?











