మన్యం వీరుడు నడయాడిని ప్రాంతంలోనే ఆయనకు అవమానం జరిగిందా ? కార్పొరేట్ సామాజిక బాధ్యత మాటున స్వాతంత్ర్య సమర యోధుడి పై వైసీపీ నేతలు చేసిన కుట్ర ఏమిటి ? అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాల పేరు మార్చడం వెనుక ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయి ? కళాశాల యాజమాన్యం తీరుపై స్థానికుల్లో జరుగుతున్న చర్చ ఏంటి ?
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరు తొలగింపు అంశం వివాదాస్పదంగా మారుతోంది. అల్లూరి సీతారామ రాజు కళాశాలగా పేరొందిన ఈ కళాశాల 1984 లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఈ కళాశాలని అంతా అల్లూరి సీతారామ రాజు డిగ్రీ కాలేజీగానే పిలుస్తున్నారు. తాజాగా కళాశాల యాజమాన్యం కళాశాల పేరును మార్చడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి 1984 లో కళాశాల ప్రారంభం కాగా.. ‘మన్యం వీరుడు’ అల్లూరి సీతారామరాజు పేరిట డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు అప్పటి ప్రభుత్వం కళాశాలను మంజూరుచేసింది.
అయితే కళాశాల పేరు మార్చడం వెనుక స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, మునిసిపల్ ఛైర్మన్ గుడబండి ఆదిలక్ష్మి ల ప్రమేయం ఉందనే వాదన బలంగా వినిపిస్తోందట. ఎమ్మెల్యే, మునిసిపల్ ఛైర్మన్ ఒత్తిళ్ళ కారణంగానే కళాశాల యాజమాన్యం ఇటువంటి చర్యలకు పాల్పడిందని స్థానికులు చర్చించుకుంటున్నారట.
నర్సీపట్నంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ నిభంధనలకు విరుద్ధంగా, ఎటువంటి ముందస్తు భద్రతా చర్యలు లేకుండానే ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో షాపింగ్ మాల్ నిర్మాణం పై మునిసిపల్ సమావేశంలో సైతం పెద్దఎత్తున చర్చ జరిగిందట.ఈ క్రమంలోనే షాపింగ్ మాల్ కు మునిసిపల్ అధికారులు 5 లక్షల రూపాయల జరిమానా విధించారట.దీంతో కొంతకాలం షాపింగ్ మాల్ నిర్మాణం నిలిచిపోయిందట. అయితే ఎమ్మెల్యే ఉమా శంకర్ , మునిసిపల్ ఛైర్మన్ ఆదిలక్ష్మి ఇరువురుని షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రసన్నం చేసుకోవడంతో ఆ అడ్డంకులు తొలగిపోయాయట. అందుకు గానూ ఇరువురికీ షాపింగ్ మాల్ వారు బాగానే ముట్టజెప్పారనే గుసగుసలు వినిపించాయట.
తాజాగా షాపింగ్ మాల్ పై స్థానికంగా చర్చ మొదలవడంతో దీన్ని కప్పిబుచ్చుకునేందుకు ఎమ్మెల్యే, మునిసిపల్ ఛైర్మన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని కొందరు చర్చించుకుంటున్నారట. అందులో భాగంగానే అల్లూరి సీతారామ రాజు కళాశాలకు సిఎంఆర్ ద్వారా ఆరు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ఇప్పించిరని టాక్.
ఈ క్రమంలోనే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కళాశాలకు ఆర్ధిక సహాయం అందించిందన్న కారణం చూపుతూ కళాశాలకు సిఎంఆర్ పేరు పెట్టాలని యాజమాన్యం పై ఒత్తిడి తెచ్చారట. దీంతో యాజమాన్యం సైతం రాత్రికి రాత్రే కళాశాల భవనం పై అల్లూరి సీతారామ రాజు పేరును తొలగించి, ఆ స్థానంలో ఆర్ధిక సహాయం అందించిన వస్త్ర దుకాణం బ్రాండ్ సిఎంఆర్ పేరును ఏర్పాటు చేసింది. అయితే స్వాతంత్య్ర సమరయోధుడి పేరును తొలగించడం పై స్థానికుల నుంచి ప్రతిఘటన మొదలయ్యింది. యాజమాన్యం చర్యలను వ్యతిరేకంగా కళాశాల పూర్వ విద్యార్ధులు, ప్రజా సంఘాలు కళాశాలకు అల్లూరి సీతారామరాజు పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
అయితే కళాశాలకు అల్లూరి వివాదాస్పదంగా మారుతోందని గుర్తించిన అధికార వైసీపీ నేతలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కళాశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారట. దీంతో యాజమాన్యం తొలగించిన అల్లూరి సీతారామరాజు పేరును మళ్ళీ ఏర్పాటు చేసింది.
మొత్తం మీద ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరు మార్చేందుకు అధికార పార్టీ నాయకులు పన్నిన వేలం కుట్రకు ఎదురుదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Must Read:-మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగిన వైసీపీ కౌన్సిలర్ లు