వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును ఇప్పుడప్పుడే వదిలేలా లేరనే చెప్పాలి. అశోక్ చైర్మన్ గా కొనసాగుతున్న మాన్సాస్ ట్రస్టు, ట్రస్టు పరిధిలోని ఆలయాలకు చెందిన భూముల వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలున్నాయని చెబుతున్న సాయిరెడ్డి.. ఇవే ఆరోపణలను ఇప్పటిదాకా చాలాసార్లే చేశారు. తాజాగా శుక్రవారం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న సందర్భంగానూ ఇవే ఆరోపణలు సాయిరెడ్డి నోట నుంచి వినిపించాయి. అక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించిన ఆధారాలున్నాయని చెబుతున్న సాయిరెడ్డి.. మరి అశోక్ పైనో, లేదంటే అక్రమాలకు పాల్పడ్డ వారిపైనో ఎందుకు చర్యలు తీసుకునే దిశగా కదలడం లేదన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అక్రమాల చిట్టా చేతిలో పెట్టుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదంటే.. సాయిరెడ్డి చేతిలోని అక్రమాల చిట్టా నకిలీది అయినా అయి ఉండాలి, లేదంటే.. అశోక్ ను అరెస్ట్ చేసే దమ్ము జగన్ సర్కారుకు లేదనే చెప్పాలి. ఈ రెండూ కాకుండా పోయే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఏమన్నాంటే..?
శుక్రవారం సింహాచలం అప్పన్న స్వామిని దర్శనం కోసం వచ్చిన సాయిరెడ్డికి ఆలయంలో ఘన స్వాగతం లభించింది. మేళతాళాలతో ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలకగా.. అప్పన్నను సాయిరెడ్డి దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఆలయం వెలుపల సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. **సింహాచలం ప్రాచీన, పురాతన దేవాలయం. దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్య అందిపైనా ఉంది. దేవాలయం ఆస్తులు దుర్వినియోగం అవుతుండటం వాస్తవం. సింహాచలం ఆస్తులను కాపాడటానికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 800 ఎకరాల భూమి పరాధీనం చేసిన తర్వాత విచారణకు ఆదేశించాం. ధర్మకర్త మండలికి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉంది. 8వేల కోట్ల విలువైన ఆస్తులు పరాధీనమైతే గత ప్రభుత్వంలో ధర్మకర్తలు, ట్రస్టీలు ఏం చేసారు? పరాధీనమైన భూములను దేవస్థానానికి అప్పగించాలనే మనోవేదన మా మనసులో ఉంది. ధర్మకర్త.. ధర్మకర్తగా ఉండాలి తప్పితే అధర్మ కర్తగా కారాదు. అశోక్ గజపతి ధర్మకర్తా?.. అథర్మ కర్తా? పైకి చాలా నీతులు చెబుతాడు.. లోపల అంతా కుట్రలు చేస్తాడు. ఏం ప్రశ్నించినా వంశాచారం అంటాడు.. అపచారం చేస్తాడు. 846 ఎకరాలు పరాధీనమైతే ఆశోక్ చూస్తూ ఎందుకు మిన్నకుండిపోయారు. అందులో తనకు కూడా ఆ వాటా ఉందా.. తేల్చి చెప్పాలి. తప్పు చేయలేదని మనస్సాక్షిగా చెప్పాలి. పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లో కూర్చుందాం రా అశోక్. నేను అడిగిన ప్రశ్నలకు అశోక్ సూటిగా జవాబు చెప్పాలి. ఆయన అఢిగిన వాటికి నేను సమాధానం చెబుతా. భక్తుల ముందు ప్రమాణం చేసి నిలబడాలి. తప్పు చేయకపోతో కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలి. వ్యవస్థలను మేనేజ్ చేయడం సరికాదు. 846 ఎకరాలపై విచారణ జరుగుతుంది.. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం@@ ఇలా సాయిరెడ్డి నాన్ స్టాప్ గా సాగిపోయారు.
రెండేళ్ల పాటు ఏం చేశారు?
సరే.. సాయిరెడ్డి ఆరోపణలు నిజమే అనుకున్నా.. జగన్ సీఎం కాగానే.. ఉన్నపళంగా మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పించి.. ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు తొలి భార్య కుమార్తె సంచయితను ఆ పదవిలో నియమించారు కదా. మొన్నటిదాకా ఆమే చైర్ పర్సన్ హోదాలో కొనసాగారు కదా. మరి అశోక్ హయాంలో అక్రమాలే జరిగి ఉంటే.. రెండేళ్ల పాటు వాటిపై ఎందుకు విచారణ జరపలేదన్న విషయంపై ఇప్పుడు సాయిరెడ్డి తక్షణమే సమాదానం చెప్పాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా న్యాయ పోరాటం చేసి అశోక్ తిరిగి చైర్మన్ పదవిని చేజిక్కించుకున్న తర్వాతే సాయిరెడ్డి ఈ తరహా ఆరోపణలు చేస్తున్న వైనం కూడా ఆసక్తి రేపేదే. వీటన్నింటినీ దాటేసి.. ఆ 800 ఎకరాలు ఎవరి హయాంలో అన్యాక్రాంతం అయ్యాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే..సంచయిత చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో సాయిరెడ్డి గానీ, వైసీపీ నేతలు గానీ ఈ ఆరోపణలు చేయలేదు. సంచయిత నుంచి అశోక్ పాలనా పగ్గాలు తీసుకున్న తర్వాతే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎవరి హయాంలో అక్రమాలు జరిగాయో తేల్చాల్సిందే కదా.
Must Read ;- జగన్ ‘ఇన్‌సైడర్’ బొమ్మ అట్టర్ ప్లాఫ్











