వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి సంబంధించి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో జాప్యం జరుగుతోందని ఇటీవల వైఎస్ వివేకా కుమార్తె సునీతా ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసిన విషయం తెలిసిందే. ఈ కేసు ముందుకు కదలకపోవడానికి గత కారణాలపై పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ లేఖ రాయడం ప్రాధాన్య అంశంగా మారింది.
ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలు..
ప్రధానంగా ఈ హత్య కేసు విషయంలో గతంలో టీడీపీలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలున్నాయన్నారు విజయమ్మ. గతంలోనూ ఈయనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ విచారణకు కూడా హాజరయ్యారు ఆదినారాయణ రెడ్డి. ప్రస్తుతం ఈయన బీజేపీలో ఉన్నారు. మొన్న తిరుపతిలో పవన్‌కల్యాణ్ సభకు కూడా ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈవిషయాన్ని ప్రస్తావించారు విజయమ్మ. ఈ హత్య కేసులో నిజాలు నిగ్గుతేల్చాలన్నదే తన కోరిక అని, షర్మిల, జగన్, సునీత కూడా అదే కోరుతున్నారన్నారు. ఈ విషయంలో తమ కుటుంబంలో మరో మాటకు తావులేదన్నారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ అని, ఆ విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ లాంటివారు నిందితులను పక్కన బెట్టుకుని మరీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ హత్య ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని, ఆ విషయం పవన్ కల్యాణ్ మర్చిపోయారని వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐ, ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని, అయితే ఆ రెండూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు కాబట్టి.. జగన్‌ని టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇదే లేఖలో చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారని, టీడీపీని కాపాడేందుకు కొన్ని ఛానెళ్లు, పత్రికలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
తల్లిగా గర్వపడుతున్నా..
ఇక తెలంగాణలో షర్మిల పార్టీకి సంబంధించిన అంశాన్నీ ప్రస్తావించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్న షర్మిలకు కుటుంబంలోని అందరి మద్దతు ఉందని, తాను ఓ తల్లిగా గర్వపడుతున్నానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం విషయంలో గతంలో తాము కూడా అనుమానాలు వ్యక్తం చేశామని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా తాము ఏం చేయలేకపోయామన్నారు. వైఎస్ కుటుంబంలో ఏ అంశంలోనూ విభేదాలు లేవని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారన్నారు.
వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయంటూ మీడియా కథనాలు ముఖ్యంగా ఏబీఎన్ –ఆంధ్రజ్యోతిని ప్రస్తావించారు. జగన్ ఢిల్లీ పర్యటన విషయంలో దగ్గరుండి మరీ చూసినట్టు రాస్తున్నారని, గత ఏడాది కాలంలో ఈ రాతలు ఎక్కువయ్యాయన్నారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డికి జగన్‌కి విభేదాలున్నాయనేది అబద్దమని, తోటమాలిని కూడా అన్న అని పిలిచే మనస్తత్వం ఉన్న వ్యక్తి తన కుమారుడు జగన్ అని చెప్పారు విజయమ్మ. అడుగడుగునా ప్రజాసంక్షేమం కోసమే పాటుపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు ఆయన కుమారుడైన జగన్‌కి కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అది చూసి తట్టుకోలేకి టీడీపీని కాపాడేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ లేఖపై రాజకీయవర్గాలు పలు కోణాల్లో చర్చించుకుంటున్నాయి.
Must Read ;- వైసీపీ ఫ్యాక్షన్ గూండాలకు భయపడం పవన్ కళ్యాణ్
YS Vijayamma Open Letter :