వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయనేమీ తిరుగుబాటు ఎంపీ ఎంతమాత్రమూ కాదు! ఏదో రఘురామక్రిష్ణ రాజు అంటే.. ఆయన జగన్ మీద నిప్పులు చెరుగుతున్నాడు గనుక.. ఆయన మాటల్ని తోసిపారేయవచ్చునని వైసీపీ దళాలు ముచ్చటపడవచ్చు. కానీ.. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి అంటే.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుల్లో ఒకరు. నిజానికి జగన్ తండ్రి వైఎస్సార్ కు కూడా ఆప్తులే. కనుకనే పార్టీకి కీలక సందర్భాల్లో అండగా ఉండే నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆ కోటాలోనే.. రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే.. ఏదో రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్న.. జగన్‌ను ఇరుకున పెడుతుందని.. జగన్ పరువు తీస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు అదే జరుగుతోంది.
ఇంతకూ ఏం జరిగింది?
రాజ్యసభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఓ ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్న ద్వారా.. ఏపీలో ఇప్పుడిప్పుడే కాళ్లూనుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని.. తాను చాలా బాగా ఇరుకున పెట్టగలనని ఆయన తలపోసి ఉండవచ్చు. కానీ.. సదరు శాఖకు సంబంధించిన మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో వేమిరెడ్డి నాలుక కరచుకుంటున్నారు. అనవసరంగా తమ పార్టీ అధినేతను ఇరుకున పెట్టేశానని బహుశా ఆయన చింతిస్తూ ఉంటారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. పోలవరం ప్రాజెక్టు గురించి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు మార్చి 8వ తేదీన రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా సమాధానం ఇచ్చారు.
వేమిరెడ్డి అడిగిన ప్రశ్నలేంటంటే..
1) పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఖర్చుచేసిన సొమ్మును విడుదల చేయాల్సిందిగా.. మరియు, సాంకేతిక నిపుణుల కమిటీ సూచించిన మేరకు మొత్తం పోలవరం వ్యయాన్ని55,650 కోట్లుగా ఆమోదించాల్సిందగా ఏపీ ముఖ్యమంత్రి 2021 ఫిబ్రవరి 19న హోంమంత్రికి మెమొరాండం సమర్పించారా?
2) ఇచ్చి ఉంటే.. దానిమీద ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకున్నారు.
3) రాష్ట్రప్రభుత్వపు వినతుల్ని పట్టించుకోవడంలో జాప్యం జరిగితే.. ప్రాజెక్టుకు సమయం మించిపోదా?
4) రాష్ట్రప్రభుత్వానికి బకాయి ఉన్న మొత్తాలను ఎప్పటికి పూర్తిగా చెల్లిస్తారు?
5) 2022 నాటికెల్లా ప్రాజెక్టును పూర్తి చేయడానికి.. నిధులు సకాలంలో అందించేలా.. కేంద్రం ఏదైనా ఆలోచన చేస్తున్నదా?
..ఇవీ ఆయన అడిగిన ప్రశ్నలు. బహుశా ఇలాంటి ప్రశ్నలను సంధించడం ద్వారా… కేంద్రాన్ని ఇరుకున పెట్టేసి.. పోలవరం విషయంలో తమ ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారో.. ప్రపంచానికి చాటిచెప్పవచ్చునని బహుశా వేమిరెడ్డి అనుకున్నట్లున్నారు. కానీ ఆ పాచిక పారలేదు.
Must Read ;- రామాయపట్నానికి నిధులివ్వం.. జగన్ సర్కారుకి కేంద్రం మరో షాక్
మంత్రి ఏం చెప్పారు?
కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి కటారియా చెప్పిన సమాధానాలు వింటే నిర్ఘాంతపోక తప్పదు. 1, 2 ప్రశ్నలకు సంబంధించి.. హోమ్ మంత్రిత్వ శాఖ వద్ద అసలు అలాంటి సమాచారం ఏదీ లేదని సెలవచ్చారు. అంటే ఏంటన్నమాట.. ముఖ్యమంత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తారీఖున హోంమంత్రి అమిత్ షాకు పోలవరం గురించి… మెమొరాండం ఇచ్చినట్టుగా కూడా అక్కడి రికార్డుల్లో ఏమీ లేదన్నమాట. మరి కొన్ని వారాల తరబడి అపాయంట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగించి, హస్తినాపురానికి వెళ్లి గంటలు గంటలపాటూ.. ఆయనకోసం నిరీక్షించి.. అమిత్ షాను కలిసి తిరిగి వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇంతకూ ఏం చేస్తున్నట్టు? ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్టు? ఏం సాధిస్తున్నట్టు?
చాలా మంది ఆరోపిస్తున్నట్టుగా.. ఆయన వ్యక్తిగత కేసులను పరిష్కరించుకోడానికే, వ్యక్తిగత కేసుల విషయంలో కేంద్రం వారి సాయం అర్థించడానికే మాటిమాటికీ వెళ్లి అమిత్ షాను కలుస్తున్నట్టే ఉంది తప్ప.. పోలవరం గురించి మెమొరాండం ఇచ్చినట్టుగా కూడా రికార్డుల్లో లేదు. ఇది రికార్డుల్లోకి ఎక్కేలా మంత్రి గారి సమాధానాన్ని బట్టి అర్థమవుతున్న సంగతి.
అలాగే మూడో ప్రశ్న పుణ్యమా అని.. 2014 తర్వాత.. రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఆ సొమ్మును మాత్రమే కేంద్రం బిల్లులను పరిశీలించిన మీదట చెల్లిస్తూ వస్తున్నది కాబట్టి.. కేంద్రం చెల్లింపుల వలన పనుల్లో జాప్యానికి ఏమాత్లరం సంబంధం లేదని కూడా తెగేసి చెప్పారు.
నాలుగో ప్రశ్నకు సమాధానంగా.. 2014 నుంచి 2021 12,392 కోట్లు ఖర్చు చేసినట్లుగా రాష్ట్రప్రభుత్వం చెప్పిందని, ఈ ఏడాది జనవరి 21 నాటికి కేవలం 1569 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నదని కూడా చెప్పారు. చెల్లింపులు అనేది నిరంతర ప్రక్రియఅని కూడా సెలవిచ్చారు.
దీనిని బట్టి.. మెజారిటీ పనులు తెలుగుదేశం హయాంలో జరిగినవే అనే సంగతి కూడా అర్థమవుతోంది.
జగన్ కట్టుకథలు బయటపడ్డాయిలా..
ఈ పార్లమెంటు సమాధానాన్ని బట్టి… పోలవరం కోసం.. రూ.55 వేల కోట్ల బడ్జెట్ ఆమోదం గురించి.. పదేపదే ఢిల్లీ వెళుతున్నా అని జగన్ పదేపదే చెబుతున్నది కట్టుకథే అని సామాన్యులకు కూడా అనిపించేలా ఉంది. అసలు అలాంటి విన్నపాలు ఇచ్చిన సమాచారం కూడా హోంశాఖ వద్ద లేదని మంత్రి అంటున్నారంటే.. జగన్ వినతిపత్రాలే ఇవ్వలేదా అనే అనుమానం కలుగుతోంది. మంత్రి సమాధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. పోలవరానికి సంబంధించి ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామని అంటున్నారు. అంటే 55 వేల బడ్జెట్ కు మంగళం పాడినట్టేనా, పునరావాసాన్ని గాలికొదిలేసినట్టేనా అనే అనుమానాలు కూడా ప్రజలకు కలుగుతున్నాయి.
పునరావాసం సంగతి తేల్చకుండా.. అనుకున్న ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు నిర్మించడం అసాధ్యం. ఎత్తు తగ్గింపు గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చిన ప్రతిసారీ.. ఆయా పత్రికలను వైఎస్సార్సీపా నాయకులు దుమ్మెత్తి పోస్తారు. కానీ.. ప్రజల్లో మాత్రం భయాలు అలాగే ఉంటున్నాయి.
మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పదేపదే ఢిల్లీ తిరుగుతున్నారు గానీ.. సాధించింది మాత్రం సున్నా అని అర్థమౌతోంది.
ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర ఖరారు కాగానే.. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేప్పుడు విడుదల చేయాల్సిన ప్రెస్ నోట్ కూడా తయారైపోతుందని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు. జగన్ ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు గురించి.. ప్రధానిని లేదా హోంమంత్రిని కలిసి విన్నవించారని.. వారు సీఎం విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటన టెంప్లేట్ తయారువుతుందని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు. అదే సమాచారంలో మార్పులు లేని ప్రకటనలను.. ఢిల్లీ పర్యటనల తేదీలు మార్చి విడుదల చేస్తుంటారని ప్రజలు అనుకునేట్లుగా వ్యవహారాలు ఉంటున్నాయి.
ఏదో ఆర్ఆర్ఆర్ విమర్శలు చేస్తే.. సరే అనుకోవచ్చు గానీ.. స్వయంగా సీఎంకు అత్యంత దగ్గరి వాడైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ప్రశ్నల ద్వారా.. జగన్ లోగుట్టు బజార్న పడ్డట్లుగా అయిందని ప్రజలు అనుకుంటున్నారు.
AlsO Read ;- క్విడ్ ప్రో కో నేటికీ కొనసాగిస్తున్నజగన్ : సబ్బం హరి
రాజ్యసభ లో అడిగిన ప్రశ్న.. వచ్చిన జవాబు తెలిపే ఆధారం ఇదే..