సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ప్రత్యూష అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ గంటా శ్రీనివాసరావుకు చెందిన 4.84 ఎకరాల భూమి పై యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
విశాఖ సమీపంలోని సింహాచలం వద్ద 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 60 ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది. మిగిలిన 64 ఎకరాలను దీపావళి పండుగ రోజున ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో గంటా శ్రీనివాసరావుకు చెందిన 4.84 ఎకరాల భూమి సర్వే నంబర్ 13 లో ఉంది. ఇటీవలే ఈ భూమిని ఇండియన్ బ్యాంక్ వేలం వేయనున్నట్టు ప్రకటించింది. 13 స్థిరాస్తులు తనఖా పెట్టి రూ.248 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో ఈ భూమిని వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది.
గంటా శ్రీనివాసరావుకు చెందిన వ్యాపార సంస్థ ప్రత్యూష రిసోర్స్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో 1997లోనే భూమి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారని రెవెన్యూ అధికారులు గంటా కు చెందిన స్థలంలో ప్రహరీని తొలగించారు. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ అశ్వినీ కుమార్ సంస్థ తరుపున కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 300-A లను ఉల్లంఘించి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా స్థలంలోకి ప్రవేశించి, నిర్మాణాలను కూల్చి వేశారని న్యాయమూర్తి ముందుంచారు.
Also Read ;- గాజువాకను టచ్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా..?
సెక్షన్ 22 ఎ పరిధిలో ఉన్న ఈ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని గత ఏడాది ఏప్రిల్ లో దరఖాస్తు చేసినట్టు కోర్టుకు తెలిపారు. ఆ వ్యవహారం ఇంకా పెండింగ్లో ఉందని, అదే ఏడాది జూన్ మాసంలో తాత్కాలిక కాంపౌండ్ వాల్ నిర్మించామని నివేదించారు. అయితే పిటిషనర్ కు ఎటువంటి హక్కులు లేవని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అనుమతిలేని నిర్మాణాలు చేపట్టారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి వివరించారు. అందులో భాగంగానే తొలగింపులు చేపట్టి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అధికారులు ఇప్పటికే భూమి స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారని చెప్పుకొచ్చారు.
ఇరు వాదనలు విన్న న్యాయస్థానం స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 18వ తేదీన తదుపరి వాదనలు ఉంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారుల నుంచి న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యూష సంస్థ భూములను వెనక్కి తీసుకో కలుగుతుందా లేదా కోర్టు తీర్పు పై ఆధారపడి ఉంది.
Also Read ;- గంటాకు వైసీపీ ద్వారాలు మూసుకుపోయినట్టేనా?