వైసీపీ అధికారంలోకి వస్తే.. రాజన్న రాజ్యం వచ్చినట్టే. నాకు ఓటేయండి.. రాజన్న రాజ్యం తీసుకొస్తాను. నవరత్నాలతో రాజన్న రాజ్యాన్ని మరిపించేలా.. పాలన సాగిస్తాను. అవినీతి అన్న మాటే లేకుండా.. పారదర్శక పాలన అందిస్తా.. ఇలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో, ఆ తర్వాత 2019 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. జగన్ మాట నిజమేనేమోనని జనం భావించారు. జగన్ పార్టీకి ఓట్లు గుద్దేశారు. జగన్ సీఎం అయ్యారు. మరి తాను చెప్పినట్లుగా రాష్ట్రంలో జగన్ రాజన్న రాజ్యాన్ని అమలు చేస్తున్నారా? అంటే.. ఇటీవలి పరిణామాలను తరచి చూస్తుంటే.. అలాంటిదేదీ కనిపించడం లేదన్న మాటే వినిపిస్తోంది. ఈ మాట సోమవారం నాడు మరింత గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు క్లిస్టర్ క్లియర్ గా కనిపించాలని జీవోఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిష్టర్) ను కొత్త గా ప్రవేశపెట్టిన పారదర్శకతకు పాతరేసి.. జీవోఐఆర్ ను రద్దు చేస్తూ వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.
జీవోఐఆర్ నేపథ్యమేంటి?
జీవోఐఆర్ ను వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతంగా ఏమీ ప్రవేశపెట్టినదేమీ కాదనే చెప్పాలి. ఎందుకంటే.. నాడు కేంద్రంలోని యూపీఏ సర్కారు సమాచార హక్కు చట్టం పేరిట పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రజలు ఎవరు అడిగినా.. ప్రభుత్వాలు సమాచారం ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే చట్టపరంగా ఆయా ప్రభుత్వాలే శిక్షార్హులు. ఈ చట్టంతో ఎలాగూ అన్ని విషయాలు వెల్లడించాల్సిందే కాబట్టి.. దానిని మరింతగా సరళతరం చేసే దిశగా వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి ఏపీలో జీవోఐఆర్‌ను ప్రవేశపెట్టారు. అంటే.. సమాచార హక్కు చట్టానికి కొనసాగింపే జీవోఐఆర్ అన్న మాట. ఈ విధానంలో ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను ఆన్ లైన్ లో పెట్టాల్సిందే. అది ఏ రకమైన జీవో అయినా కూడా ఆన్ లైన్ కి చేరాల్సిందే. అలా ఆన్ లైన్ లో పెడితేనే.. దానికి ఓ నెంబర్ కేటాయించబడుతుంది. అంటే.. జీవోఐఆర్ వెబ్ సైట్ లో జీవోను పెడితేనే దానికి నెంబర్ వస్తుందన్న మాట. మొత్తంగా జీవోఐఆర్ తో వైఎస్ రాజశేఖరరెడ్డి.. సర్కారు తీసుకునే నిర్ణయాలు వెనువెంటనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్న మాట. వైఎస్ ప్రారంభించిన ఈ విధానాన్ని ఆయన తర్వాత వచ్చిన సీఎంలు, ఆ తర్వాత తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయాక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి.
ఇప్పుడు జగన్ చేసిందేమిటి?
పారదర్శక కోసమంటూ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన జీవోఐఆర్ ను ఇప్పుడు జగన్ ఏకంగా రద్దు చేసి పారేశారు. అంటే.. ప్రభుత్వం ఇకపై విడుదల చేసే ఏ ఒక్క జీవో కూడా ఆన్ లైన్ లో ఉండదు. అంటే ప్రజలతో పాటు మీడియా సంస్థలకు కూడా ఈ వివరాలేమీ తెలియవు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత.. ఆయా విషయాల్లో రేకెత్తే అనుమానాలతో ఎవరైనా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గానీ.. ఆ జీవో మనకు తెలియదన్న మాట. అంటే.. వైఎస్సార్ పారదర్శకతకు శ్రీకారం చుడితే.. జగన్ అదే పారదర్శకతకు పాతరేశారన్న మాట. ఇంకా చెప్పాలంటే.. తండ్రి శ్రీకారం చుట్టిన పారదర్శకతకు కొడుకే పాతరేశారన్న మాట. మరి జగనన్న రాజన్న రాజ్యాన్ని ఎక్కడ తెచ్చినట్టు? రాజన్న రాజ్యాన్ని మించిన సంక్షేమ రాజ్యాన్ని ఎక్కడ తెచ్చినట్టు? మరి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేవీ ప్రజలకు, ప్రజలకు సమాచారం చేరవేసే మీడియా సంస్థలకు చిక్కకుండా అన్నింటా రహస్య మంత్రాన్నే పాటిస్తే.. ఇక ఏపీలో రాజన్న రాజ్యం ఎక్కడ? అందుకే ఏపీలో ఇప్పుడు కొనసాగుతున్నది రాజన్న రాజ్యం కాదని.. అది ముమ్మాటికీ చీకటి రాజ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కేసీఆర్‌దీ జగన్ మాదిరి చీకటి రాజ్యమేనా?











