అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‘ సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అఖిల్ జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా టైటిల్ ను బట్టే కంటెంట్ ఎలా ఉంటుందనే విషయం అర్థమైపోతుంది. లాక్ డౌన్ కి ముందుగానే 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత మిగతా భాగం షూటింగు జరుపుకుంది. దాంతో ఈ సినిమా ‘సంక్రాంతి’ బరిలోకి దిగుతుందని అంతా భావించారు.
కానీ సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడం లేదు. దాంతో సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటం వలన, వీలు చూసుకుని రంగంలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. కానీ విడుదల విషయంలో ఆలస్యం జరగడానికి కారణం, నాగార్జున కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయమని సూచించడమేనని అంటున్నారు. అటు చైతూ సినిమా అయినా, ఇటు అఖిల్ సినిమా అయినా ఫైనల్ అవుట్ పుట్ చూడటం నాగార్జునకి అలవాటు. అలా చూసినప్పుడు ఆయన ఆయా సినిమాలకు రీ షూట్ లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా చూసిన నాగార్జున, కొన్ని కీలకమైన సన్నివేశాలు అంత సంతృప్తికరంగా అనిపించలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకే ఆయా సన్నివేశాలను రీ షూట్ చేయమని భాస్కర్ తో చెప్పాడని అంటున్నారు. దాంతో దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో మరింత ఆలస్యం జరగవచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరి.
Must Read ;- అఖిల్ సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు.?