నేటి కాలంలో మోసాలన్నీ ఒక్క క్లిక్ తో అయిపోతున్నాయి. అవేనండీ.. సైబర్ నేరాలు… ఇప్పుడు మోసగాళ్లు డబ్బును కొట్టేయడానికి కష్టపడి ఇంటిని చోరి చేయడం లాంటివి చేయాల్సిన పనిలేదు. చాలా హాయిగా ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుని నిమిషాల్లో కోట్లను కొల్లగొడుతున్నారు. అంతేనా, ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా, పోగొట్టుకన్న డబ్బు తిరిగి పొందడం అనేది కలలో మాటే. అలాంటి నయా మోసాలకు తార్కాణాలే ఈ సంఘలనలు…
ఎన్నిసార్లు చెప్పాలి
నేటి కాలంలో ఫోన్ రూపంలో ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోతుంది. బ్యాంకింగ్, ట్రేడింగ్, క్లాసులు… ఇలా ఏదైనా మొబైల్ తో పని జరిగిపోతుంది. దానితో పాటు సైబర్ నేరాలకు కూడా ఈ టెక్నాలజీ ఊతమిచ్చిందని చెప్పాలి. నెట్టింట్లో డబ్బును పోగొట్టుకుంటున్న సంఘటనలు కొత్తగా వెలుగులోకి రాలేదు. ఇప్పటికి ఇలాంటివి కుప్పలుతెప్పలుగా జరిగాయి. పోలీసులు సైతం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం, సెలబ్రిటీల చేత ప్రచారం చేయించడం లాంటివి చేస్తూనే ఉన్నారు. కానీ, ప్రజలు మాత్రం వారి మాటలను పెడ చెవిన పెట్టి మోసపోతూనే ఉన్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి లబోదిబో అంటున్నారు.
Must Read ;- పేలడానికి సిద్ధంగా పెరల్ వైన్ కుంభకోణం.. ప్రభుత్వ చర్యలు నిల్ !
అప్రమత్తత ఆవశ్యకం
ఇబ్రహీంపట్నం కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా డబ్బు రెండింతలు అవుతుందంటే నమ్మి ప్రారంభించాడు. మొదట చిన్నమొత్తంతో ప్రారంభించిన అతను క్రమంగా డబ్బు ఎక్కువ వస్తుండడంతో అవతలి వ్యక్తిని నమ్మి 32 లక్షలు జమ చేశాడు. తను నమోదు చేసుకున్న ఆన్ లైన్ ట్రేడింగ్ లో పెరుగుతున్నట్లు కనిపించినా, బ్యాంక్ లో జమకాకపోవడంతో ఆరా తీస్తే మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇక మరొక సంఘటనలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువతికి పీజీ లో 60 లక్షలకు సీటు ఇప్పిస్తానని చెప్పి యూనివర్శిటి పేరున డీడీ కట్టించాడో వ్యక్తి. కానీ అప్రమత్తమైన ఆ యువతి ఆరాతీయగా బండారం బయటపడింది. వెంటనే బ్యాంక్ సిబ్బంది ద్వారా ఆ ఖాతాల్లో డబ్బు జమ కాకుండా జాగ్రత్త పడింది.
ఇలాంటివి ఎన్నో
కేవలం ఇలాంటివే కాదు, మీకు సంబంధించిన బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ బ్యాంక్ వివరాలు అడగడం, ఉద్యోగ అవకాశం పేరుతో లింక్ పండడం దానిపై క్లిక్ చేస్తే చాలు మీ బ్యాంక్ లోని డబ్బు నిమిషాల్లో స్వాహా అవడం ఖాయం. అంతేకాదు, మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు, మీ వివరాలు నమోదు చేయండంటూ వెబ్ లింక్ లు లాంటివి ఫోన్లకు పంపడం. వీటితోపాటు, మెయిల్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. కేవలం ఒక మెయిల్ తో కోట్లు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమాచారాలు అందినప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. వీలైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.
చివరగా ఒక మాటను గుర్తుంచుకోండి… ఇలా మోసపోతున్నట్లు బయటపడిన ప్రతి సంఘటనలో అత్యాశ పడిన వారే బాధితులవుతున్నారని గమనించండి.
Also Read ;- ఇక సైబర్ సీమలో రైతుల సందడి!