(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో చుక్కెదురైంది. తన కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్ నాయుడును తన రాజకీయ వారసుడిగా పరిచయం చేసేందుకు చేసిన తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. సీనియర్ రాజకీయ నాయకుడు, సౌమ్యుడు అయిన కళా వెంకటరావుకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది..? అందుకు గల కారణాలు ఏంటి..? దీనికి కారకులు ఎవరు..? తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారా ..! అయితే ఆయన పూర్వాపరాలు తెలుసుకోండి.
టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా రేగిడి. ఆయన 1952 జూలై 1న జన్మించారు. బి.ఎ., బి.ఎల్ డిగ్రీలను చదివారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 2004 ఎన్నికల్లో ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసన సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వాణిజ్య పన్నులు, పురపాలక, హోంశాఖలలో మంత్రిగా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 2009 శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వం వహించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
నియోజకవర్గం విలీనంతో ..
2009లో కళా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉణుకూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలలో విలీనమైంది. ఆయన నివాస ప్రాంతం రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చేరింది. అది ఎస్సీ రిజర్వుడుగా మారింది. అందువల్ల బీసీ కులానికి చెందిన కళా వెంకట్రావు పక్కనున్న ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీసాల నీలకంఠం చేతిలో ఓడిపోయారు. 2012లో ప్రజారాజ్యం పార్టీని వదిలి రెండేళ్ల పాటు ఏ రాజకీయపార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో మరోమారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎచ్చెర్ల నుండి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఈ నేపధ్యంలో తన కుమారుని రాజకీయ వారసునిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించుకోగలిగారు.
ఎన్నాళ్లీ వలస పల్లకీ మోత ..
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో తన తనయుడు రామ్‌మల్లిక్‌ను ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేసేందుకు నిర్ణయించారు. భవిష్యత్ రాజకీయాలకు పునాది వేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆ నియోజకవర్గం నాయకులకు స్వయంగా కళా ఫోన్ చేసి విషయం తెలిపినట్లు తెలిసింది. మల్లిక్ ద్వారా కూడా ఫోన్లు చేయించారని భోగట్టా. చాలా మంది నాయకులు ఫోన్లు లిఫ్ట్ చేయలేదని తెలిసింది. మల్లిక్ పరిచయ కార్యక్రమానికి చాలా మంది మొఖం చాటేసినట్లు తెలిసింది. దీనికంతటికీ కారణం కళా కుటుంబాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గం నేతలు వలస వాసులుగా భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది. ఇంకెన్నాళ్లీ వలస పల్లకీ మోత అని అక్కడ నాయకులు మొఖం చాటేస్తున్నట్లు వినికిడి. స్థానిక నాయకులను పక్కన పెట్టడం వల్ల వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇన్నాళ్లు తండ్రిని మోసాం, ఇప్పుడు తనయుడును మోయాలా అనే విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కళా రాజకీయ వారసత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురవ్వడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Must Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!











