ఏపీలో రేషన్ ఇక్కట్లు తప్పడం లేదు. సర్వర్ సమస్యలు లబ్దిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో పోస్ యంత్రంలో ఒకసారి వేలి ముద్ర తీసుకుని రేషన్ ఇచ్చేవారు. నేడు బియ్యానికి ఒకసారి వేలి ముద్ర, శనగలకు మరోసారి వేలి ముద్రవేయాల్సి వస్తోంది. సర్వర్ సపోర్ట్ లేకపోవడంతో రోజుకు 20 మందికి మించి రేషన్ సరఫరా కావడం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక జనం ఇంటిదారి పడుతున్నారు. అధికారులకు సమస్య వివరించినా ఫలితం లేకుండా పోయిందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ సర్వర్ సమస్యలు
ఏపీలో మొత్తం కోటి 60 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ పంపిణీ పూర్తి చేయాలి. నవంబరులో పంపిణీ చేయాల్సిన రేషన్ నేటికీ 45 శాతం కూడా పూర్తి చేయలేదు. సర్వర్లు మెురాయించడంతో రేషన్ డీలర్లు రోజుకు 20 మందికి మించి రేషన్ ఇవ్వలేకపోతున్నారు. జనవరి నుంచి ఇంటింటికి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాలంటీర్లు ప్రతికార్డుదారుని ఇంటి వద్ద మ్యాపింగ్ చేస్తున్నారు. రేషన్ పంపిణీకి, మ్యాపింగ్ కు ఒకే సర్వర్ ఉపయోగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. అయినా సరిచేసే కార్యక్రమం మాత్రం చేయడంలేదు.
Must Read ;- ఏం చేద్దాం : రేషన్ డీలర్లకు చెక్ పడనుందా?
ప్రకాశంలో మరీ దారుణం
ప్రకాశం జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లా మొత్తం 10లక్షల 25 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో ఇప్పటికీ సగం మందికి కూడా రేషన్ ఇవ్వలేకపోయారు. సర్వర్ మొరాయించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు బియ్యానికి ఒకసారి, శనగలకు మరోసారి వేలిముద్ర వేయాల్సి రావడం కూడా సమస్యను మరింత పెంచింది. దీంతో రేషన్ కోసం జనం వారం రోజులు తిరగాల్సి వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే, మరో రెండు రోజుల్లో రేషన్ పంపిణీ పూర్తి చేయాలని అధికారులు రేషన్ డీటర్లను ఆదేశించారు. దీంతో డీలర్లు ఆందోళన బాటపట్టారు.
ఎందుకీ అరాచకం…
రేషన్ పంపిణీకి బయోమెట్రిక్ విధానం పెట్టడం ద్వారా రేషన్ పక్కదారి పట్టకుండా లబ్దిదారులకు చేరుతుందనే మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో తరచూ సాంకేతిక సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సాంకేతిక సమస్యలు, కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడం వంటి సమస్యలు నేటికీ వేధిస్తూనే ఉన్నాయి. ఈ పోస్ యంత్రాలను ప్రవేశపెట్టి ఏడు సంవత్సరాలు దాటిపోతున్నా నేటికీ సాంకేతిక సమస్యలను అధిగమించకపోవడంతో, లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది రేషన్ తీసుకోవడానికి ఒకటి రెండుసార్లు తిరిగి ఒట్టి చేతులతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఏటా రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సాంకేతిక సమస్యలను పట్టించుకోకపోవడ శోచనీయం.
Also Read ;- భూకంపాల తలదన్నే భూ భాగోతాలు!











