రజినీ మక్కల్ మండ్రమ్ రాజకీయ పార్టీగా రూపుదాల్చబోతుందన్నది స్పష్టమైపోయింది. తమిళ సూపర్ స్టార్ క్రియాశీలక రాజకీయాల వైపే మొగ్గుచూపుతున్నారని లియో న్యూస్ ముందే కథనం రాసింది. ఆ మాటే ఇప్పుడు నిజమవుతోంది. ఈరోజు ఈ ప్రకటనతో కొత్త రాజకీయ పునరేకీకరణకు తలుపులు తెరిచనట్లయింది. తమిళ రాజకీయానికి తెరవెనుక సూత్రధారి ఎవరు? పాత్ర ధారి ఎవరు ? అనేదాని మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజా వార్త ఏమిటంటే జైలులో ఉన్న శశికళ జనవరి 27న విడుదల కాబోతున్నారు.
అసలు రజినీ విడుదలకూ, శశికళ విడుదలకూ సంబంధం ఉందా? అనే కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. డీఎంకేకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ శక్తుల పునరేకీకరణ తప్పదన్నది మాత్రం స్పష్టమవుతోంది. మూడు రోజుల క్రితం రజినీ కాంత్ రజినీ మక్కల్ మండ్రమ్ జిల్లా కార్యదర్శులందరితోనూ భేటీ కావడంతోనే కొంత స్పష్టత వచ్చేసింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా తమిళనాడుకు రావడంతోనే ఇక్కడ రాజకీయ చైతన్యం మొదలైంది.

తమిళనాడులోని మరో స్టార్ హీరో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో ఓ పార్టీ పెట్టేసి ఓ అనుభవాన్ని కూడా సంపాదించుకున్నారు. ఇక్కడ తన బలం ఒక్కటే సరిపోదనేది ఈపాటికే ఆయనకు అర్థమైపోయింది. తనకు మరో తోడు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. రజినీతో కలవడానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కాకపోతే రజినీ వెనక భారతీయ జనతా పార్టీ ఉంటే మాత్రం కమల్ రజినీకి దూరంగా ఉండటానికే అవకాశం ఎక్కువ.
అసలు భాజపా బయటికి రాకుండా తెరవెనుక మాత్రమే రాజకీయం నడిపినా జనం అర్థం చేసుకోనంత అమాయకులు కాదు. ఇంకో పక్క మరో తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ కూడా కార్యరంగంలోకి దూకే అవకాశం కనిపిస్తోంది. మరి విజయ్ వెనుక ఏ శక్తులున్నాయో తెలియాలి. ఓ పక్క రజినీ రాజకీయ బరిలోకి దూకడం, ఇంకో పక్క శశికళ విడుదల కానుండటం తమిళనాట రాజకీయం రసకందాయానికి చేరుకుంది. కొత్త సంవత్సరం నుంచి తమిళనాడులో కొత్త రాజకీయ ఉత్సాహం కనిపించనుంది.
Must Read ;- రజినీ పిలుపు తమిళనాట ఏ రాజకీయ మలుపు?











