( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో రాజకీయ పరిణామాలు ఊహకందని రీతిలో మలుపులు తిరుగుతున్నాయి. విశాఖలో తిరుగులేదు అనుకున్న నాయకుడికి… చెక్ పడుతుండగా… మరో యువ నాయకుడు జిల్లాలో కీలకంగా ఎదుగుతున్నారు. ఒకదానితో మరొకదానికి సంబంధం లేకున్నా అంతిమంగా ఒక చోటే కలుస్తున్నాయి.
పరిస్థితిని చక్కదిద్దే పని
ఎంపీ విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా విశాఖలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేతుల మీదుగా నడుస్తున్న కొన్ని వ్యవహారాలు పార్టీకి, జగన్‌కి కాస్త మైనస్‌గా మారుతూ ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంపీ నిర్వహిస్తున్న ట్రస్ట్ లావాదేవీలు, చక్కపెడుతున్న ఇతర రెవిన్యూ వ్యవహారాలపైన నివేదికలను ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించినట్లు సమాచారం. ఇంకో వైపు స్థానిక ఎమ్మెల్యేలతో కూడా ఎంపీకి సత్సంబంధాలు కొనసాగడం లేదు. డిసిఆర్ సమావేశం వేదికగా స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలతో వారు తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. ఈ దశలో ఒకరిని వెనకేసుకుంటూ వస్తే మిగిలిన వారిలో అసంతృప్తి రేగుతోంది అన్న భావన పార్టీ హైకమాండ్‌లో మొదలైంది. ఇక్కడి వ్యవహారాలు తెలుసుకున్న జగన్ … ఎంపి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తన అంతరంగీకుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
పరిపాలనా రాజధాని విశాఖలో అటు పార్టీకి, ఇటు జగన్‌కు మైలేజ్ ఇచ్చే విధంగా వ్యవహరించాల్సిన నాయకుడు తిరోగమన దిశలో పయనిస్తుండటంతో.. ప్రాధాన్యం తగ్గించే పనిలో పడినట్టు విశ్వసనీయ సమాచారం. అమరావతిని కాదని విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న జగన్మోహన్రెడ్డి అందుకు అడ్డుగా ఉన్న ఒక్కో గోడను తొలగించుకుంటూ ముందుకు పోతున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష నాయకులను సైతం తన వైపునకు తిప్పు కుంటున్నారు. కోర్టులో వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చేసి విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ సాగిస్తున్న వ్యవహారాల పైన ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది.
Must Read;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు
అనకాపల్లి ఎమ్మెల్యేకి కలిసి వస్తున్న కాలం..
యువ నాయకుడైన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు కాలం కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. నగరంలో ఉన్న ఇతర ఎమ్మెల్యేల కన్నా అమర్నాథ్ పలువురు మంత్రులతో సఖ్యతగా మెలగడం, ప్రతిపక్షంపై ఘాటైన విమర్శలు చేయడం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఇటీవల కాలంలో కలిసి వచ్చిందనే చెప్పాలి. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండున్నర ఏళ్లకు గాను మంత్రులకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ కోటాలోనే విశాఖ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన తర్వాత విశాఖ నుంచి ఆ అవకాశం అమర్నాథ్ దక్కించుకుంటాడని ప్రచారంలో ఉంది. మరోవైపు మంత్రి ముత్తంశెట్టి తీరుతో పార్టీ హైకమాండ్ వద్ద ఆయన పట్టు పూర్తిగా సన్నగిల్లిందని, గంటా శ్రీనివాసరావుతో ఉన్న విభేదాల కారణంగా.. పార్టీలో చేరికను మంత్రి అడ్డుకుంటే.. ఇక్కడ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పార్టీకి చేరేలా ఆయన వ్యతిరేక వర్గం చక్రం తిప్పుతుండడంతో అది కాస్తా అమర్నాథ్కు కలిసి వస్తోంది. విశాఖలో అనూహ్యంగా మారుతున్న పరిణామాలతో పార్టీలో నేతల ప్రాధాన్యక్రమాలు తలకిందులు అవుతున్నాయి.
Also Read ;- విశాఖలో ముఠాకొట్లాటలతో ఫ్యాన్ కు చెమటలు!











